ఏఐలోకి ‘మెగా’ఎంట్రీ! | Mega Engineering and Infra is also going to enter the AI ​​field | Sakshi
Sakshi News home page

ఏఐలోకి ‘మెగా’ఎంట్రీ!

Jun 28 2026 1:36 AM | Updated on Jun 28 2026 1:36 AM

Mega Engineering and Infra is also going to enter the AI ​​field

అనలాగ్‌ ఏఐతో భాగస్వామ్యం

డీల్‌ వివరాలు 1న ప్రకటించే అవకాశం..

సాక్షి, బిజినెస్‌: మూడు దశాబ్దాలకుపైగా ఇన్‌ఫ్రా రంగంలో ఉంటూ వివిధ రంగాల్లోకి విస్తరిస్తున్న స్థానిక సంస్థ మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టనుంది. మైక్రోసాఫ్ట్‌లో రెండు దశాబ్దాలు పనిచేసిన అలెక్స్‌ కిప్‌మాన్‌ సంస్థ అనలాగ్‌ ఏఐతో చేతులు కలపబోతోంది. ఈ భాగస్వామ్యం ఏ రూపంలో ఉంటుంది? ఎంత పెట్టుబడి పెడతారు? అనే వివరాలు బహుశా జూలై ఒకటిన వెల్లడి కావచ్చు. ఆ రోజున కిప్‌మాన్‌తో కలిసి నిర్వహించే సమావేశంలో ఎంఈఐఎల్‌ దీనిపై ప్రకటన చేసే అవకాశముంది.  

ఫౌండేషన్‌ ఏఐ కాదిది.. పారిశ్రామిక ఏఐ! 
చాట్‌ జీపీటీ, క్లాడ్, పెర్‌ప్లెక్సిటీ మాదిరి అనలాగ్‌ ఏఐ సంస్థ ఫౌండేషనల్‌ ఏఐ లేదా జనరేటివ్‌ ఏఐ కాదు... ఇది పారిశ్రామిక ఏఐ. భౌతికంగా ఇంటెలిజెన్స్‌ను తయారు చేస్తుంది. అంటే సెన్సర్లు, రోబోలు, న్యూరల్‌ నెట్‌వర్క్‌లను కలుపుతూ భౌతిక యంత్రాలకు డిజిటల్‌ నకళ్లను తయారు చేస్తుంది. వాహనాలు, యంత్రాలు, పరిశ్రమలు... ఇలా పనిచేసే వేటికైనా డిజిటల్‌ ట్విన్స్‌ను తయారు చేయడం ద్వారా వాటిని రిమోట్‌గా వేరే చోటు నుంచి మానిటర్‌ చేయొచ్చు. ఈ డిజిటల్‌ నకళ్లు నిరంతరం అప్‌డేట్‌ అవుతూ వాటి ట్విన్స్‌ను ట్రాక్‌ చేస్తూ ఉంటాయి. 

ఇలా ట్రాక్‌ చేయడం ద్వారా నిర్వహణను ముందే ఊహించొచ్చు. సమస్యలు రాకుండా నివారించే అవకాశమూ ఉంటుంది. సీమెన్స్, స్నీడర్, జీఈ వెర్నోవా, రాక్‌వెల్‌ వంటి దిగ్గజాలున్న ఈ రంగంలోకి పూర్తి ఏఐ కంపెనీగా అడుగుపెట్టింది అనలాగ్‌ ఏఐ. అబుదాబికి చెందిన టెక్నాలజీ దిగ్గజం జీ24... ఈ సంస్థకు అవసరమైన పూర్తి ఫండింగ్‌ను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందుకే దీని విలువను ఇప్పటిదాకా ఎక్కడా వెల్లడించలేదు. 

వచ్చే పదేళ్లలో భారత్‌ సహా అన్నిచోట్లా 80 శాతానికిపైగా భారీ పరిశ్రమలు తమ కీలక ఆపరేషన్లలో డిజిటల్‌ ట్విన్స్‌ను ఉపయోగిస్తాయన్నది నిపుణుల అంచనా. తయారీ రంగంతోపాటు విద్యుత్, చమురు, గ్యాస్, రైల్వే, మెట్రో వ్యవస్థ, పోర్టులు–షిప్పింగ్, నిర్మాణ రంగం, మైనింగ్‌... ఇలా అన్ని రంగాలూ పారిశ్రామిక ఏఐ, డిజిటల్‌ ట్విన్స్‌ వల్ల లబ్ధి పొందుతాయనేది వారి మాట. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement