
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. నిధుల అక్రమ మళ్లింపు, కార్పొరేట్ పాలనలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏప్రిల్‌లో చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే.
కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. బుకింగ్ ద్వారా క్యాబ్(రైడ్‌హెయిలింగ్) సర్వీసులు అందించే బ్లూస్మార్ట్ మొబిలిటీని సైతం అన్మోల్ ప్రమోట్ చేయడం గమనార్హం!
కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్‌మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్‌లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్‌లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది.
జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్‌సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది.