లగ్జరీ కారు ..  స్పెషల్‌ గేరు..  | Luxury car companies in India are now focusing on unique and personalized features | Sakshi
Sakshi News home page

లగ్జరీ కారు ..  స్పెషల్‌ గేరు.. 

Jun 15 2025 5:25 AM | Updated on Jun 15 2025 10:44 AM

Luxury car companies in India are now focusing on unique and personalized features

పర్సనలైజేషన్‌కు సంపన్నుల ప్రాధాన్యత 

ప్రత్యేక హంగులతో లిమిటెడ్‌ ఎడిషన్లు 

సాధారణ మోడల్స్‌తో పోలిస్తే అధిక రేటు

లగ్జరీ కార్ల కంపెనీలు మరింత పర్సనలైజ్డ్‌ అనుభూతిని అందించే కార్లతో సంపన్న కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా స్పెషల్, లిమిటెడ్‌ ఎడిషన్‌ వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. తద్వారా భారీ మార్జిన్లుండే సెగ్మెంట్‌లో వాటాను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశీయంగా రూ. 50 లక్షలకు పైగా ఉండే లగ్జరీ కార్ల మోడల్స్‌ గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 51,500 యూనిట్లు అమ్ముడైనట్లు పరిశ్రమ వర్గాల అంచనా.

 అయితే, శాతాలపరంగా వృద్ధి గత మూడేళ్ల కనిష్టమైన 3.3 శాతానికే పరిమితమైంది. అంతర్జాతీయంగా అనిశ్చితులు, స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 55.3 శాతం వృద్ధి చెందిన లగ్జరీ కార్ల అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 16.7 శాతంగా నమోదయ్యాయి. తాజా గా ఇది గణనీయంగా పడిపోవడంతో కొత్త మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీలు.. లిమిటెడ్‌ ఎడిషన్ల బాట పట్టాయి.  

హెచ్‌ఎన్‌ఐల జోరు .. 
భారత్‌లో 1 కోటి డాలర్ల పైగా (సుమారు రూ. 85 కోట్లు) సంపద ఉన్న అత్యంత సంపన్నుల సంఖ్య గణనీయంగా పెరు గుతుండటంతో లగ్జరీ బ్రాండ్లు.. సదరు సంపన్నులపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక ప్రకారం గతేడాది అత్యంత సంపన్నుల (హెచ్‌ఎన్‌ఐ) సంఖ్య 6 శాతం పెరిగి 85,698కి చేరింది. సంపన్న కస్టమర్లు తమ హోదాను, అంతస్తును ప్రతిబింబించే కార్లను కోరు కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మె ర్సిడెస్‌–బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌), మినీలాంటి ఆటో దిగ్గజాలు తమ ప్రస్తుత మోడల్స్‌లో స్పెషల్‌ ఎడిషన్లు, హైపర్‌ కస్టమైజ్డ్‌ వెర్షన్లను ప్రవేశపెడుతున్నాయి. 

లగ్జరీ కార్ల సెగ్మెంట్లో దాదాపు 45 శాతంవాటాతో మెర్సిడెస్‌ బెంజ్‌ అగ్రగామిగా ఉంటోంది. తర్వాత స్థానాల్లో బీఎండబ్ల్యూ, జేఎల్‌ఆర్, ఆడి మొదలైనవి ఉన్నాయి. టాప్‌ ఎండ్‌ కస్టమర్లు ప్రీమియం అనుభూతి కోసం మరింత ఎక్కువ చెల్లించేందుకు సుముఖంగా ఉంటుండటంతో, ఈ కార్ల కంపెనీలు కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్‌లో భాగమైన జేఎల్‌ఆర్‌ కొత్తగా డిఫెండర్‌ ఆక్టా పేరిట తమ స్టాండర్డ్‌ డిఫెండర్‌కి సంబంధించిన ప్రత్యేక వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రెగ్యులర్‌ మోడల్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం అధికంగా రూ. 2.59 కోట్లు పలికింది. ఎక్స్‌క్లూజివ్‌ పెయింట్‌ షేడ్స్, కస్టమైజ్డ్‌ ఇంటీరియర్స్, పర్ఫార్మెన్స్‌ అప్‌గ్రేడేషన్‌ మొద లైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.  

మెర్సిడెస్‌–బెంజ్‌ సంస్థ మరింత వ్యక్తిగతీకరించడంపై ఫోకస్‌ పెడుతోంది. తమ టాప్‌ ఎండ్‌ లగ్జరీ కస్టమర్లు, సేకరణకర్తలకు హైపర్‌–పర్సనలైజేషన్‌ అంశం చాలా కీలకంగా ఉంటోందని మెర్సిడెస్‌ బెంజ్‌ వర్గాలు తెలిపాయి. తమ మాన్యుఫ్యాక్టర్‌ శ్రేణి, ఇతరత్రా ప్రత్యేక ఎడిషన్లకు అసాధారణ డిమాండ్‌ కనిపించిందని పేర్కొన్నాయి. ఏఎంజీ జీ63 గ్రాండ్‌ ఎడిషన్‌లో ప్రవేశపెట్టిన మొత్తం 25 యూనిట్లు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలో అమ్ముడైపోయినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. దీని ధర రూ. 4 కోట్లు. ఇక ఈ ఏడాది మార్చి 17న ప్రవేశపెట్టిన మేబ్యాక్‌ ఎస్‌ఎల్‌ 680 మోనోగ్రామ్‌ సిరీస్‌ను ఉదయం ప్రవేశపెడితే సాయంకాలానికల్లా మొత్తం బుక్‌ అయిపోయాయి. రెండు రోజుల క్రితమే కొంపెనీ కొత్తగా ఏఎంజీ జీ63 ‘కలెక్టర్స్‌ ఎడిషన్‌’ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 4.3 కోట్లు. కేవలం 30 యూనిట్లే విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. చాలాకాలంగా తాము కార్ల కస్టమైజేషన్‌ను అందిస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ సంతోష్‌ అయ్యర్‌ తెలిపారు. కలెక్టర్స్‌ ఎడిషన్‌ను బెంగళూరులోని మెర్సిడెస్‌–బెంజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా (ఎంబీఆర్‌డీఐ)తో కలిసి, భారత పరిస్థితులకు అనుగుణంగా కంపెనీ రూపొందించింది.  

మరికొన్ని బ్రాండ్లను చూస్తే ఎం340ఐ మోడల్‌ను బీఎండబ్ల్యూ రూ. 75,90,000కు విక్రయిస్తోంది. ఇప్పటివరకు 1,000 పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు రేంజ్‌ రోవర్‌ రణ్‌థంబోర్‌ ప్రత్యేక ఎడిషన్‌ రేటు రెగ్యులర్‌ వెర్షన్‌తో పోలిస్తే రూ. 43 లక్షలు అధికంగా రూ. 4.98 కోట్లకు (ఎక్స్‌–షోరూం) అమ్ముడయ్యింది. మొత్తం 12 వాహనాలూ అమ్ముడైపోయాయి. అటు మినీ కూపర్‌ ఎస్‌ జాన్‌ కూపర్‌ ధర రూ. 55,90,000గా ఉండగా, మొదటి లాట్‌ స్వల్ప వ్యవధిలోనే అమ్ముడైపోయింది.

ఉభయతారకంగా .. 
వినూత్నంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్, లుక్‌తో ఈ మోడల్స్‌ అత్యంత మెరుగైన పనితీరు కనపర్చేవిగా ఉంటాయని జేఎల్‌ఆర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. ఇలా లిమిటెడ్‌ ఎడిషన్లు, స్పెషల్‌ ఎడిషన్‌ మోడల్స్‌ను ప్రవేశపెట్టడమనేది ఇటు కంపెనీలకు, అటు కస్టమర్లకు .. రెండు వర్గాలకూ ప్రయోజనకరమైన విషయమని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ మొబిలిటీ డైరెక్టర్‌ పునీత్‌ గుప్తా తెలిపారు. సదరు మోడల్‌ జీవితకాలాన్ని, కొనుగోలుదార్లను పెంచుకునేందుకు ఇది కంపెనీలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఓవరాల్‌ లుక్, ఫీల్, ఇంటీరియర్స్, పనితీరుపరంగా ఒక విశిష్టమైన గుర్తింపు పొందడమనేది కస్టమర్లకు ప్రయోజనకరమైన అంశంగా ఉంటుంది. తక్కువ మొత్తం పెట్టుబడితో అధిక మార్జిన్లను పొందే అవకాశం ఉండటంతో కంపెనీలకూ 
ఆదాయాలపరంగా బాగుంటోంది.

కొన్ని కార్లు.. 
→ డిఫెండర్‌ ఆక్టా ధర రూ. 2.59 కోట్లు 
→ రేంజ్‌రోవర్‌ రణ్‌థంబోర్‌ రేటు రూ. 4.98 కోట్లు 
→ మెర్సిడెస్‌ మేబ్యాక్‌ ఎస్‌ఎల్‌ 680 మోనోగ్రామ్‌ సిరీస్‌ ధర రూ. 4.2 కోట్లు 
→ ఏఎంజీ జీ63 కలెక్టర్స్‌ ఎడిషన్‌ రూ. 4.3 కోట్లు

Advertisement
 
Advertisement
Advertisement