ప్రపంచంలోని టాప్‌ 20 ఎయిర్‌పోర్ట్‌లు | list of the world 20 best airports for 2025 | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోని టాప్‌ 20 ఎయిర్‌పోర్ట్‌లు

Apr 11 2025 4:03 PM | Updated on Apr 11 2025 4:42 PM

list of the world 20 best airports for 2025

ప్రపంచంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగి ఎయిర్‌పోర్ట్‌ నిలిచిందని స్కైట్రాక్స్ ప్రకటించింది. ఈ విమానాశ్రయం రికార్డు స్థాయిలో 13వసారి ఈ టైటిల్ గెలుచుకోవడం గమనార్హం. జ్యువెల్ కాంప్లెక్స్, ఇండోర్ జలపాతం, ఆకర్షణీయ గార్డెన్‌లకు చాంగి ఎయిర్‌పోర్ట్‌ ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానాల్లో హమద్ (దోహా), హనేడా (టోక్యో) విమానాశ్రయాలు నిలిచాయి. దక్షిణాసియాతోపాటు ఇండియాలో ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నిలిచింది.

చాంగి ఎయిర్‌పోర్ట్‌

చాంగి ఎయిర్‌పోర్ట్‌ 2024లో 8 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఇందులో 10 అంతస్తుల జ్యువెల్ షాపింగ్ కాంప్లెక్స్‌ ఎంతో ‍ప్రసిద్ధి చెందింది. ఇందులో బటర్‌ఫ్లై పార్క్‌, ఇండోర్ గార్డెన్లు, జలపాతాలు ఉన్నాయి.  ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో స్పాలు, హోటళ్లు, కళా ప్రదర్శనలు, మ్యూజియం, సినిమా థియేటర్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు ఉన్నాయి. దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గతంలో మూడుసార్లు ప్రపంచ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. అయితే ఈ సంవత్సరం ఇది రెండో స్థానానికి చేరింది. టోక్యోలోని హనేడా విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. దాంతోపాటు ప్రపంచంలోనే ఉత్తమ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌గా, పీఆర్ఎమ్ & యాక్సెసబుల్ సౌకర్యాలను అందించడంలో టాప్‌లో నిలిచింది.

భారత విమానాశ్రయాల ర్యాంకింగ్స్..

ప్రపంచంలోని టాప్ 20 విమానాశ్రయాల జాబితాలో ఏ భారతీయ విమానాశ్రయం లేనప్పటికీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంతోపాటు దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండియా, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సర్వీస్‌ అవార్డును అందుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇండియా, దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా అవార్డును గెలుచుకుంది. గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదు మిలియన్ల కంటే తక్కువ ప్రయాణీకుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు సాధించింది.

ఇదీ చదవండి: టెస్లా కొత్త సైబర్‌ట్రక్‌ విడుదల.. ధర ఎంతంటే..

2025లో 20 ఉత్తమ విమానాశ్రయాల జాబితా

  1. సింగపూర్ చాంగి విమానాశ్రయం

  2. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహా

  3. టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం (హనేడా)

  4. ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కొరియా

  5. నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్

  6. హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

  7. పారిస్ చార్లెస్ డి గాల్ విమానాశ్రయం

  8. రోమ్ ఫియుమిసినో విమానాశ్రయం

  9. మ్యూనిచ్ విమానాశ్రయం

  10. జ్యూరిచ్ విమానాశ్రయం

  11. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం

  12. హెల్సింకి-వాంటావా విమానాశ్రయం

  13. వాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయం

  14. ఇస్తాంబుల్ విమానాశ్రయం

  15. వియన్నా అంతర్జాతీయ విమానాశ్రయం

  16. మెల్‌బోర్న్‌ విమానాశ్రయం

  17. చుబు సెంట్రైర్ అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్

  18. కోపెన్ హాగన్ విమానాశ్రయం

  19. ఆమ్ స్టర్ డామ్ షిపోల్ విమానాశ్రయం

  20. బహ్రయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
     

Advertisement
 
Advertisement
Advertisement