
షాపర్స్‌స్టాప్ లాభం పతనం
రిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్‌స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 4 శాతం పెరిగి రూ. 1,090 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 77 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 4,628 కోట్లకు చేరింది.
ఈక్విటాస్ లాభం పతనం
ప్రయివేట్ రంగ సంస్థ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్‌ఎఫ్‌బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 80 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 208 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,685 కోట్ల నుంచి రూ. 1,869 కోట్లకు ఎగసింది. ప్రొవిజన్లు రూ. 107 కోట్ల నుంచి రూ. 258 కోట్లకు భారీగా పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్‌పీఏలు) 2.61 శాతం నుంచి 2.89 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 1.17 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి.
ఇదీ చదవండి: లోకల్ కంటెంట్‌పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
లాటెంట్ వ్యూ అనలిటిక్స్ నికరలాభం రూ.51 కోట్లు
డిజిటల్ అనలిటిక్స్ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ప్రొవెడర్ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.51.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు 2023–24 ఇదే క్వార్టర్‌లో నికరలాభం రూ.45.23 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.187.45 కోట్ల నుంచి రూ.253.29 కోట్లకు పెరిగింది. ‘‘త్రైమాసిక ప్రాతిపదికన 1.9%, వార్షిక ప్రాతిపదికన 35.3 శాతం పెరుగుదలతో వరుసగా తొమ్మిదో సారి ఆదాయం వృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. బలమైన వ్యాపార మూలాలు, క్లయింట్లతో సత్సంబంధాలు మా స్థిరమైన పనితీరుకు నిదర్శనం’’ అని కంపెనీ సీఈవో రాజన్ సేతురామన్ తెలిపారు. 2025 మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ.173.49 కోట్లు, మొత్తం ఆదాయం రూ. 916.78 కోట్లుగా ప్రకటించింది.