క్యూ2లో రూ. 10,053 కోట్లు
బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 32 శాతం జంప్‌చేసి రూ. 10,053 కోట్లను తాకింది. కమిషన్ల చెల్లింపు తగ్గడం ఇందుకు సహకరించింది.
గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 7,621 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,29,620 కోట్ల నుంచి రూ. 2,39,614 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,22,366 కోట్ల నుంచి రూ. 2,30,160 కోట్లకు పెరిగాయి. కమిషన్ చెల్లింపులు రూ. 6,542 కోట్ల నుంచి రూ. 5,772 కోట్లకు తగ్గాయి. కాగా.. నికర ప్రీమియం ఆదాయం రూ. 1,19,901 కోట్ల నుంచి రూ. 1,26,479 కోట్లకు పుంజుకోగా.. రెన్యువల్ ప్రీమియం రూ. 61,910 కోట్ల నుంచి రూ. 64,996 కోట్లకు బలపడింది. తొలి ఏడాది ప్రీమియం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 10,836 కోట్లకు క్షీణించింది. ఇందుకు జీఎస్‌టీ సవరణలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియంను 18% జీఎస్‌టీ నుంచి మినహాయించడం సానుకూల ఫలితాలను చూపనున్నట్లు ఎల్‌ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి పేర్కొన్నారు. స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.72% నుంచి 1.34%కి తగ్గాయని చెప్పారు.
ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?


