
65 శాతం దరఖాస్తులు వీరి నుంచే
20–23 ఏళ్ల వయసు వారి నుంచి పోటీ
వర్క్‌ఇండియా నివేదిక వెల్లడి
బ్లూకాలర్ ఉద్యోగాల్లో (శ్రమ ఆధారిత కార్మిక, నైపుణ్య పనులు) మిలీనియల్స్ (30–45 ఏళ్ల వయసు వారు), జెనరేషన్ జెడ్ (30 ఏళ్లలోపు) ఎక్కువగా పోటీపడుతున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో ఈ విభాగంలో ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో 65 శాతం మేర మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచే ఉండడం గమనార్హం. ఇందులోనూ 20–23 వయసు వారి నుంచే అధికంగా ఉన్నాయి. ఈ వయసు విభాగంలో ఉద్యోగ దరఖాస్తులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 51 శాతం పెరిగాయి. ఈ వివరాలను బ్లూ, గ్రే కాలర్ జాబ్ ప్లాట్‌ఫామ్ అయిన వర్క్‌ఇండియా వెల్లడించింది.
యువత నుంచి (తాజా గ్రాడ్యుయేట్లు) బ్లూకాలర్ ఉద్యోగాలకు దరఖాస్తులు 85.5% పెరిగాయని, చిన్న వయసులోనే ఉద్యోగాల్లో చేరాలన్న ఆసక్తికి ఇది నిదర్శనమని పేర్కొంది. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారి నుంచి కూడా ఉద్యోగ దరఖాస్తుల్లో 37 శాతం వృద్ధి కనిపించింది. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు వర్క్ ఇండియా ప్లాట్‌ఫామ్‌పై 111.71 మిలియన్ ఉద్యోగార్థుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. చదువుతో సంబంధం లేకుండా వివిధ వర్గాల వారి నుంచి ఉద్యోగాల నిర్వహణ పట్ల ఆకాంక్షలు, సన్నద్ధత పెరుగుతున్నట్టు పేర్కొంది.
మధ్య వయసులో మహిళలు డ్రాప్!
కెరీర్ ఆరంభంలో ఉన్న యువతీ, యువకులు ఉద్యోగాలకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకుంటున్నట్టు వర్క్‌ఇండియా నివేదిక వెల్లడించింది. 27–29 ఏళ్ల వయసు మహిళల నుంచి ఉద్యోగ దరఖాస్తులు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. కానీ, ఇదే వయసు పురుషుల నుంచి మాత్రం దరఖాస్తులు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీన్ని బట్టి ఈ వయసు మహిళలు కెరీర్ నుంచి మధ్యలోనే వైదొలగడం లేదంటే అవరోధాలను ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై దృష్టి సారించాలని సూచించింది. ఉద్యోగాల కోసం అవసరమైతే వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం యువత సుముఖత చూపిస్తున్నట్టు తెలిపింది. ఇక బ్లూకాలర్‌కు అదనంగా టైపిస్ట్, డేటా ఎంట్రీ, సేల్స్, హెచ్‌ఆర్, తయారీ ఉద్యోగ విభాగాలు సైతం అధిక వృద్ధిని చూస్తున్నట్టు వివరించింది. టైర్4 పట్టణాల నుంచి ఉద్యోగ దరఖాస్తులు 55 శాతం వరకు పెరిగినట్టు తెలిపింది.
ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం