
2027 మార్చి నాటికి సాధిస్తాం
గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ శ్రీనివాసన్
టీవీఎస్ గ్రూప్ వేణు శ్రీనివాసన్, ఇన్సూరెన్స్ వెటరన్ వి.జగన్నాథన్ ఏర్పాటు చేసిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 2027 మార్చి నాటికి రూ.450 కోట్ల ప్రీమియం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.40 కోట్ల ప్రీమియం ఆదాయం నమోదు చేశామని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లుగా ఉండొచ్చని కంపెనీ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్ ప్రకటించారు.
‘పూర్తి రక్షణతో కూడిన మంచి ఉత్పత్తులను ఆఫర్ చేస్తూ, సులభతర క్లెయిమ్‌లు, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టాం. దేశంలో ఆరోగ్య సంరక్షణకు చేసే వ్యయంలో సగం మేర ఔట్ పేషెంట్ రూపంలోనే (ఓపీడీ) ఉంటోంది. కనుక గెలాక్సీ ఓపీడీ కవర్ ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు వీలుగా రూపొందించాం. నాలుగేళ్లలో బ్రేక్‌ఈవెన్ (లాభ, నష్టాల్లోని స్థితి)కు రావాలన్న లక్ష్యంతో ఉన్నాం’అని చెప్పారు.
గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఎనిమిది పాలసీలను, రెండు రైడర్లను ఆఫర్ చేస్తుండగా, మొదటి ఏడాది 700 క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. క్లెయిమ్ పరిష్కారాలు సులభతరంగా ఉండేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు, ఇప్పటి వరకు 1.2 లక్షల మందికి కవరేజీ ఇచి్చనట్టు చెప్పారు. జీఎస్‌టీ రేట్లు తగ్గించడం వల్ల కస్టమర్లకు భారం తగ్గుతుందని, బీమా సంస్థలు తమ వంతుగా కొంత భారం భరించనున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల పరిధిలో 6,000 నెట్‌వర్క్ ఆస్పత్రులతో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తోంది.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!