జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ చేతికి డ్యూలక్స్‌  | JSW Paints acquires Dulux-maker AkzoNobel India for Rs 8,986 crore | Sakshi
Sakshi News home page

జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ చేతికి డ్యూలక్స్‌ 

Jun 28 2025 6:29 AM | Updated on Jun 28 2025 8:08 AM

JSW Paints acquires Dulux-maker AkzoNobel India for Rs 8,986 crore

అక్సో నోబెల్‌ ఇండియా కొనుగోలు  

డీల్‌ విలువ రూ. 12,915 కోట్లు 

నాలుగో పెద్ద కంపెనీగా అవతరణ 

సాధారణ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌ 

షేరుకి రూ. 3,418 ధరలో కొనుగోలు

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దేశీ గ్రూప్‌ జేఎస్‌డబ్ల్యూ తాజాగా డచ్‌ పెయింట్ల దేశీ దిగ్గజం అక్సో నోబెల్‌ ఇండియాను సొంతం చేసుకోనుంది. సజ్జన్‌ జిందాల్‌ గ్రూప్‌ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ ఇందుకు డ్యూలక్స్‌ బ్రాండ్‌ మాతృ సంస్థ అక్సో నోబెల్‌ ఎన్‌వీతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా అక్సో నోబెల్‌ ఇండియాలో 74.76% వాటా కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ. 8,986 కోట్లుకాగా.. అక్సో నోబెల్‌ దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీకావడంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 25 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఇందుకు షేరుకి రూ. 3,417.77 ధరలో మరో రూ. 3,929 కోట్లు వెచి్చంచనుంది. 

వెరసి డ్యూలక్స్‌ పెయింట్ల బిజినెస్‌ను రూ. 12,915 కోట్లకు చేజిక్కించుకోనుంది. 2019లోనే పెయింట్ల బిజినెస్‌లోకి ప్రవేశించిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ తాజా కొనుగోలుతో దేశీయంగా పెయింట్ల రంగంలో నాలుగో పెద్ద కంపెనీగా అవతరించనుంది.     ఏషియన్‌ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్‌తో పాటు, కన్సాయ్‌ నెరోలాక్‌ తొలి మూడు ర్యాంకులలో నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశీ సంస్థ చేతిలో ఉన్న లిక్విడ్‌ పెయింట్స్, కోటింగ్స్‌ విభాగం జేఎస్‌డబ్ల్యూ సొంతం కానుండగా.. పౌడర్‌ కోటింగ్స్‌ బిజినెస్, ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ మాత్రం పూర్తిస్థాయిలో అక్సో నోబెల్‌ చేతిలో మిగలనున్నాయి. ఈ అంశాన్ని డచ్‌ దిగ్గజం అక్సో నోబెల్‌ వెల్లడించింది.  

పోటీ తీవ్రతరం 
పెయింట్ల రంగంలో ఇప్పటికే దేశీయంగా ఏషియన్, బెర్జర్‌ పెయింట్స్‌సహా.. కన్సాయ్‌ నెరోలాక్, అక్సో నోబెల్, ఇండిగో, షాలిమార్, నిప్పన్‌ కార్యకలాపాలు విస్తరించగా.. గత 5–6 ఏళ్లలో మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌తోపాటు.. ఒపస్‌ బ్రాండుతో ఆదిత్య బిర్లా గ్రూప్, పిడిలైట్‌(హరీషా), ఆస్ట్రల్‌ పైప్స్‌(జెమ్‌), జేకే సిమెంట్స్‌(ఆక్రో) సైతం పోటీకి సై అంటున్నాయి. 

ఈ నేపథ్యంలో అక్సో నోబెల్‌ ఇండియా విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీ డెకొరేటివ్‌ బిజినెస్‌లో ప్రధానంగా పోటీ తీవ్రతరమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏబీ గ్రూప్‌ రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో ఒపస్‌ను తీసుకువచి్చన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. పెయింట్లు, కోటింగ్స్‌ బిజినెస్‌ దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్నట్లు జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ ఎండీ పార్ధ్‌ జిందాల్‌ పేర్కొన్నారు. ఈ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలలో జేఎస్‌డబ్ల్యూ ఒకటని తెలియజేశారు.   

షేరు తీరిలా...

తాజా వార్తల నేపథ్యంలో అక్సో నోబెల్‌ ఇండియా షేరు బీఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 3,415 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,533 వద్ద గరిష్టాన్ని తాకింది.  

2025లో డీల్స్‌ జోరు.. 
జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, డ్యూలక్స్‌ డీల్‌ 2025లో నమోదైన అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలవనుంది. గత నెలలో జపనీస్‌ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్‌ కార్ప్‌ రూ. 13,483 కోట్లకు దేశీ సంస్థ యస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతక్రితం మార్చిలో బజాజ్‌ అలియెంజ్‌ లైఫ్‌తోపాటు జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో జర్మన్‌ భాగస్వామి అలియెంజ్‌కున్న 26 శాతం వాటాను బజాజ్‌ గ్రూప్‌(బజాజ్‌ ఫిన్‌సర్వ్‌) మొత్తం రూ. 24,180 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది అతిపెద్ద డీల్‌కాగా.. ఈ ఫిబ్రవరిలో అయానా రెన్యువబుల్‌ పవర్‌ కొనుగోలుకి రూ. 19,500 కోట్ల ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ గ్రీన్‌ డీల్‌ రెండో ర్యాంకులో నిలుస్తోంది. హల్దీరామ్స్‌లో 10 శాతం వాటా కొనుగోలుకి సింగపూర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ టెమాసెక్‌ ఈ మార్చిలో రూ. 8,600 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. వీటితో పోలిస్తే జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌– అక్సో నోబెల్‌ డీల్‌ ఈ ఏడాది నమోదైన అతి పెద్ద డీల్స్‌లో ఒకటిగా నిలవనుంది.

Advertisement
 
Advertisement
Advertisement