జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాలు | JSW Group Introduces New Ampstar Brand For Electric Commercial Vehicles | Sakshi
Sakshi News home page

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాలు

Sep 23 2026 4:45 AM | Updated on Sep 23 2026 4:45 AM

JSW Group Introduces New Ampstar Brand For Electric Commercial Vehicles

యాంప్‌స్టర్‌ బ్రాండ్‌ కింద బస్సులు, ట్రక్కులు 

రూ. 2,500 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జేఎస్‌డబ్ల్యూ గ్రీన్‌టెక్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. యాంప్‌స్టర్‌ బ్రాండ్‌ పేరిట ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కుల డిజైన్, తయారీ విక్రయ కార్యకలాపాలు చేపడుతున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో 90 ఎకరాల్లో కంపెనీ భారీ ప్లాంటు ఏర్పాటు చేసింది. ఇంధనాల దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, జాతి నిర్మాణానికి ఎలక్ట్రిక్‌ కమర్షియల్‌ మొబిలిటీ దోహదపడుతుందనే ఉద్దేశంతో ఈ దిశగా దృష్టి పెట్టినట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ యాంప్‌స్టర్‌ బ్రాండ్‌ ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు. 

ప్లాంటుపై రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఆయన తనయుడు పార్థ్‌ జిందాల్‌ వివరించారు. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 15,000 యూనిట్లుగా (బస్సులు, ట్రక్కులు) ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తదితర గ్రూప్‌ సంస్థలకు వీటిని అందిస్తుండగా, వేదాంత గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ మొదలైన ఇతర సంస్థలకు కూడా సరఫరా చేసేందుకు ఎంవోయూలు కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.

విద్యుత్‌ బస్సుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్‌లో కూడా పాలుపంచుకోనున్నట్లు పార్థ్‌ చెప్పారు. స్కూళ్లు, నగరాలు, ఇంటర్‌సిటీ ప్రయాణాలకు ఉపయోగపడే యాంప్‌స్టర్‌ బస్సుల మోడల్స్‌ 7 మీటర్ల నుంచి 18 మీటర్ల వరకు పొడవు ఉంటాయి. ఎలక్ట్రిక్‌ ట్రక్కులకు సంబంధించి ప్రాథమికంగా 55 టన్నుల ట్రాక్టర్‌ ట్రైలర్‌తో మొదలుపెట్టి టిప్పర్లు, డంపర్లు మొదలైన వాటిని కూడా కంపెనీ తీసుకురానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement