'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు' | Infosys To Hire 20000 Fresh Engineering Graduates in FY26 | Sakshi
Sakshi News home page

'ఇన్ఫోసిస్‌లో 20వేల ఉద్యోగాలు': క్లారిటీ ఇచ్చిన సీఎఫ్‌ఓ

Apr 18 2025 3:31 PM | Updated on Apr 18 2025 4:04 PM

Infosys To Hire 20000 Fresh Engineering Graduates in FY26

గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సమయంలో.. ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ మాత్రం కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది.

ఇన్ఫోసిస్ ఉద్యోగుల వేతనాల పెంపుకు సంబంధించిన ఒక అప్డేట్ గురించి, విలేకర్ల సమావేశంలో సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'జయేష్ సంఘ్రాజ్కా' మాట్లాడుతూ.. ఎక్కువ మందికి జనవరిలోనే జీతాల పెంపు జరిగింది. మిగిలినవారికి జీతాల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇన్ఫోసిస్‌లోని చాలా మంది ఉద్యోగుల జీతాల పెంపు సగటున 5-8 శాతం వరకు ఉంటుంది. ఇది గడచిన సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే కంపెనీలు అత్యుత్తమ పనితీరును కనపరచిన ఉద్యోగులకు జీతం 10-12 శాతం పెంచినట్లు సమాచారం.

నియామకాల అంచనా
జీతాల పెంపు గురించి మాత్రమే కాకుండా.. ఉద్యోగ నియామకాలను గురించి కూడా ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా వెల్లడించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.

ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలు
గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?

అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్‌ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!

Advertisement
 
Advertisement
Advertisement