కేంద్రానికి మైనర్ల సంఘం డిమాండ్
చౌక అల్యూమినియం దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫిమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమియం డౌన్‌స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు తదితర) దిగుమతులపై 15 కస్టమ్స్ సుంకం విధించాలని డిమాండ్ చేసింది. అల్యూమినియం ఉత్పత్తి మిగులు ఉన్న చైనా, రష్యా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెరిగిపోతుండడంతో దేశీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.
ఇతర దేశాలు టారిఫ్‌లు విధించడంతో ఇవి తమ మిగులు ఉత్పత్తులను భారత్‌కు మళ్లిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల దేశీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని, అది పెట్టబడులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. దిగుమతులతో దేశీ సంస్థలు పోటీ పడేందుకు వీలుగా కస్టమ్స్ సుంకం విధించాలని కోరింది. 2025–26లో అల్యూమినియం డిమాండ్‌లో 55 శాతం దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్టు వివరించింది. కనుక చౌక దిగుమతుల కట్టడికి ప్రమాణాలను పెంచాలని కోరింది. తయారీలోకి వినియోగించే కీలక ముడిపదార్థాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని పేర్కొంది.


