
తొలిసారిగా నెలవారీ డేటా విడుదల
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్‌లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు ఈ డేటాను మూడు నెలలకోసారి, ఏడాదికోసారి ప్రకటిస్తున్న కేంద్రం .. ఇలా నెలవారీ గణాంకాలను విడుదల చేయడం ఇదే ప్రథమం. ఉద్యోగార్హతలు ఉన్న నిరుద్యోగుల గణాంకాలను రియల్ టైమ్‌లో పర్యవేక్షించే దిశగా కేంద్ర గణాంకాలు, ప్రోగ్రాంల అమలు శాఖ గురువారం తొలిసారిగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను (పీఎల్‌ఎఫ్‌ఎస్) విడుదల చేసింది.
వీటి ప్రకారం ఏప్రిల్‌లో వివిధ వయస్సుల్లోని ఉద్యోగార్థుల్లో నిరుద్యోగిత రేటు 5.1 శాతంగా ఉంది. ఇది మహిళలతో పోలిస్తే (5 శాతం) పురుషుల్లో కాస్త అధికంగా 5.2 శాతంగా ఉంది. 89,434 కుటుంబాలపై (గ్రామీణ ప్రాంతాల్లో 49,323, పట్టణ ప్రాంతాల్లో 40,111) ఈ సర్వే చేశారు. ఇందులో 3,80,838 మంది (గ్రామీణ ప్రాంతాల్లో 2,17,483 మంది, పట్టణ ప్రాంతాల్లో 1,63,355 మంది) పాల్గొన్నారు.
మరిన్ని వివరాలు..
→ దేశవ్యాప్తంగా 15–29 వయస్సు గ్రూప్‌లో నిరుద్యోగిత రేటు (యూఆర్) 13.8 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 17.2 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 12.3 శాతంగా నమోదైంది.
→ 15–29 ఏళ్ల గ్రూప్‌లో మహిళల్లో యూఆర్ మొత్తం మీద 14.4 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 23.7 శాతంగా, గ్రామాల్లో 10.7 శాతంగా ఉంది. అదే పురుషుల విషయానికొస్తే దేశవ్యాప్తంగా 13.6 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో 15 శాతంగా, గ్రామాల్లో 13 శాతంగా నమోదైంది.