
దేశంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 917 మంది మహిళలు
గ్రామీణ ప్రాంతాల్లో 914 మంది, పట్టణాల్లో 925 మంది స్త్రీలు
నమూనా గణాంకాలు–2023 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో బాలికల జనన రేటు తగ్గుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే జనన లింగ నిష్పత్తిలో భేదం కనబడుతోంది. భారత్‌లో సగటున ప్రతి వెయ్యి మంది పురుషులకు 917 మంది మహిళలున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 914 మంది స్త్రీలుండగా పట్టణ ప్రాంతాల్లో వెయ్యిమంది పురుషులకు 925 మంది స్త్రీలున్నారు.
ఈ మేరకు 2021–2023 మధ్య కాలంలో లింగ నిష్పత్తి గణాంకాలను నమూనా గణాంకాల–2023 నివేదిక తాజాగా వెల్లడించింది.ఆంధ్రప్రదేశ్‌లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లోనే లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది పురుషులకు 938 మంది స్త్రీలుండగా అదే పట్టణ ప్రాంతాల్లో వెయ్యిమంది పురుషులకు 953 మంది స్త్రీలున్నారు.
ఢిల్లీలో గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాల్లో లింగ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి వెయ్యి మంది పురుషులకు అత్యధికంగా 974 మంది స్త్రీలున్నారు. ఆ తరువాత కేరళలో వెయ్యి మంది పురుషులకు 971 మంది స్త్రీలున్నారు. వెయ్యి మంది పురుషులకు 868 మంది స్త్రీలతో ఉత్తరాఖండ్‌లో అత్యల్ప లింగ నిష్పత్తి ఉంది.