దశాబ్ద కాలంలో తగ్గిన వినియోగ వృద్ధి
వెచ్చిస్తున్న సమయంలో కూడా తగ్గుదల
ప్రపంచ రోజువారీ సగటు 140 నిమిషాలు
మనదేశంలో ఇది 20 నిమిషాలు ఎక్కువే
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది. సామాజిక మాధ్యమాల్లో విహరించడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లకు దినచర్యగా మారిపోయింది. ఆన్లైన్ కంటెంట్ వినియోగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ వేదికలను ఉపయోగించే విషయంలో యూజర్లలో ఒకనాటి దూకుడు ప్రస్తుతం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్‌నెట్ వాడుతున్న వారు సుమారు 604 కోట్లు కాగా.. సోషల్ మీడియా (ఎస్‌ఎం) యూజర్లు 560 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 65 శాతానికిపైగా అన్నమాట. ప్రతిరోజూ 4.10 లక్షల మంది కొత్తగా వీరికి తోడవుతున్నారు. మనదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నవారి సంఖ్య సుమారు 70 కోట్లని అంచనా.
అంతర్జాతీయంగా 2025 నాటికి ఎస్‌ఎం రోజువారీ వినియోగం స్థిరంగా ఉండగా.. వార్షిక వృద్ధి రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య ఊహించని రీతిలో కొత్త శిఖరాలకు చేరుకోవడంతో మార్కెట్ సంతృప్త స్థాయికి (సాచురేషన్) చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి.
» భారత్‌లో సోషల్ మీడియా వాడకం
» రోజువారీ సగటు వినియోగం.. 2 గంటల 40 నిమిషాలు
» ఆన్లైన్ సమయంలో ఎస్‌ఎం వాటా 34
» యూట్యూబ్ బ్రాడ్‌కాస్ట్ 2025 నివేదిక ప్రకారం.. మనదేశంలో 18 ఏళ్లకు పైబడినవారు సగటున రోజుకు 72 నిమిషాలు యూట్యూబ్ వీడియోల కోసం వెచ్చిస్తున్నారు. జూన్ 2025 నాటికి దేశంలో యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న వీక్షకులు 65 కోట్లు.
వ్యసనంగా మారిపోయింది
సోషల్ మీడియా వాడకంతో టీనేజర్లలో మానసిక ప్రభావం
వ్యసనం 30% మందికి
ఒంటరితనం 20% మంది
నిద్ర సమస్యలు 17% మందికి
షార్ట్ వీడియోలు, రీల్స్‌కే!
యూజర్ల తీరు, కంటెంట్ ప్రాధాన్యత
షార్ట్ వీడియోలు, రీల్స్‌కు అత్యధిక సమయం వెచ్చిస్తున్నవారు 80%
వీడియో కంటెంట్ కోసం ఎఫ్‌బీ, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నవారు 90%
అప్‌డేట్స్ కోసం ఎఫ్‌బీ వాడుతున్నవారు 17%
స్టోరీస్ కోసం ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్నవారు 7%
» యూజర్లు వారానికి సగటున 18 గంటల 36 నిమిషాలు ఎస్‌ఎంకి కేటాయిస్తున్నట్టు అంచనా.
» ముఖ్యంగా 18 ఏళ్లకు పైబడిన ప్రపంచ జనాభాలో 92 శాతానికిపైగా ఎస్‌ఎం వినియోగిస్తున్నారట.
» మొత్తం సోషల్ మీడియా యూజర్లలో పురుషులు 54 శాతానికిపైగా ఉన్నారు. అంటే మహిళలు సగానికంటే తక్కువే ఉన్నారన్నమాట.
పెరిగి.. తగ్గింది!
ప్రపంచవ్యాప్తంగా ఎస్‌ఎం వేదికలపై యూజర్లు వెచ్చించిన సగటు సమయం
-ఆధారం: గ్లోబల్ వెబ్ ఇండెక్స్, స్టాటిస్టా, డేటా రిపోర్టల్


