
సెప్టెంబర్‌లో 5.2 శాతం
ఆగస్ట్‌లో ఇది 5.1 శాతమే
గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుదల ఎక్కువ
న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో నిరుద్యోగం (ఉపాధి లేమి) కాస్తంత ఎగిసింది. ఆగస్ట్‌లో 5.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు, అంతకుమించి వయసులోని వారికి సంబంధించి ఉపాధి వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది జూలైలో నిరుద్యోగిత 5.2 శాతంగా ఉంటే, జూన్, మే నెలల్లో 5.6 శాతం, ఏప్రిల్‌లో 5.1 శాతం చొప్పున నమోదు కావడం గమనార్హం. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగినట్టు గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్‌లో 4.3 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 4.6 శాతానికి ఎగిసింది. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 6.7 శాతం నుంచి 6.8 శాతానికి చేరింది.
ఉపాధి గణాంకాలు..
→ పట్టణ మహిళల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్‌లో ఉన్న 8.9 శాతం నుంచి సెప్టెంబర్‌లో 9.3 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగిత 5.2 శాతం నుంచి 5.5 శాతానికి ఎగిసింది.
→ పట్టణ పురుషుల్లో ఉపాధి లేమి 5.9 శాతం నుంచి 6 శాతానికి.. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది.
→ పనిచేసే జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సెప్టెంబర్ చివరికి 52.4 శాతానికి చేరింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శ్రామికశక్తి పెరగడం ఇందుకు అనుకూలించింది.
→ మహిళల్లో డబ్ల్యూపీఆర్ జూన్‌లో 30.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 32.3 శాతానికి మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కారి్మక శక్తి గత మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. జూన్‌లో 33.6 శాతంగా ఉంటే,
సెప్టెంబర్ చివరికి 36.3 శాతానికి చేరింది.
→ 15 ఏళ్లు, అంతకుమించిన జనాభాలో కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో నమోదైన 54.2 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 55.3 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 56.1 శాతం నుంచి 57.4 శాతానికి మెరుగుపడగా, పట్టణాల్లో మాత్రం 50.9 శాతం వద్దే కొనసాగింది. మహిళా కారి్మకుల భాగస్వామ్య రేటు (పనిచేసే వారు) జూన్‌లో ఉన్న 32 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 37.9 శాతానికి పుంజుకున్నది.