ఈ ఐటీకి ఏమైంది..? | India Software Industry Faces Job Cuts Amid AI Transition, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

ఈ ఐటీకి ఏమైంది..?

Jul 29 2025 5:31 AM | Updated on Jul 29 2025 10:31 AM

India Software Industry Faces Job Cuts Amid AI Transition

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో తొలగింపు గుబులు... 

టీసీఎస్‌ 12,000 సిబ్బంది కోత ప్రకటనతో ఉలిక్కిపడ్డ ఐటీ పరిశ్రమ 

ఏఐ, ఆటోమేషన్, అధిక వ్యయాల ఎఫెక్ట్‌ 

ఇది ఆరంభమే.. మరిన్ని కంపెనీలదీ ఇదే బాట అంటున్న విశ్లేషకులు

2000 సంవత్సరంలో వై2కే, 2017లో క్లౌడ్‌.. ఇప్పుడు ఏఐ.. ఇలా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగులకు సరికొత్త సాంకేతికతలు పెను సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ కల్పవృక్షంగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక్కసారిగా ‘కోత’ల గుబులు మొదలైంది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టీసీఎస్‌ 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పరిశ్రమకు షాక్‌ తగిలింది. 

ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ దెబ్బ, మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల ఆదాయాలకు చిల్లు పడుతోంది. దీంతో వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పులిమీదపుట్రలా ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), ఆటోమేషన్‌ కూడా ఉద్యోగులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. టీసీఎస్‌ చర్యలు ఆరంభమేనని.. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చనేది విశ్లేషకుల మాట.

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగాల తొలగింపు వార్త అటు ఐటీ రంగాన్నే కాదు.. స్టాక్‌ మార్కెట్లను సైతం కుదిపేసింది. పరిశ్రమ లీడర్‌ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా కంపెనీలు ఎలాంటి చర్యలకు దిగుతాయోనన్న భయమే దీనికి  కారణం. వాస్తవానికి ఐటీలో కొత్త ఉద్యోగాలు గత రెండు మూడేళ్లుగా పెద్దగా పెరగడం లేదు. టీసీఎస్‌నే తీసుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.14 లక్షల గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే, 2019–20లో 4.48 లక్షలుగా ఉన్న కంపెనీ సిబ్బంది సంఖ్య తదుపరి మూడేళ్లలో ఏకంగా 1.7 లక్షలు పెరగడం విశేషం.

 ఆపై క్రమంగా దిగజారుతూనే ఉంది. 2023–24లో 6.01 లక్షలకు పడిపోయింది. 13,249 మంది సిబ్బంది తగ్గిపోయారు. గతేడాది కాస్త పుంజుకుని 6.07 లక్షలకు చేరుకుంది. తాజాగా 2025–26 తొలి త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 5,090 మంది సిబ్బంది జతయ్యారు. అయినప్పటికీ మొత్తం సిబ్బంది సంఖ్య మూడేళ్ల క్రితం నాటి గరిష్ట స్థాయి కిందే కొనసాగుతోంది. ఇక మిగతా కంపెనీల విషయానికొస్తే, టాప్‌–5 కంపెనీలు కలిపి ఈ ఏడాది క్యూ1లో కేవలం 4,703 ఉద్యోగులను మాత్రమే నికరంగా జత చేసుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్‌ మినహా మిగతా మూడు కంపెనీల్లో సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఐటీ నియామకాల్లో మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఎందుకీ పరిస్థితి... 

టీసీఎస్‌ ప్రకటించిన 12,000 మంది సిబ్బంది కోతల్లో అత్యధికంగా మధ్య, సీనియర్‌ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం చూపనుంది. భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా తీర్చిదిద్దడం, టెక్నాలజీలో పెట్టుబడులపై మరింత ఫోకస్‌ చేయడం, ఏఐ వినియోగం, మార్కెట్‌ విస్తరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి విస్తృత వ్యూహాలను కంపెనీ దీనికి కారణంగా చెబుతోంది. అంటే, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాల వైపే నడుస్తాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ‘ఆర్థిక ఒత్తిళ్లతో పాటు క్లయింట్ల అంచనాలు, అలాగే చురుకైన, ఫలితాల ఆధారిత డెలివరీ విధానాల దిశగా పరిశ్రమలో వస్తున్న మార్పులు వంటి అనేక అంశాలు టీసీఎస్‌ సిబ్బంది కోత నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ సంస్థలో రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ వ్యాఖ్యానించారు

  • బెంచ్‌ సిబ్బంది విషయంలో కఠిన పాలసీని కంపెనీలన్నీ అమలు చేస్తుండటాన్ని చూస్తుంటే, సిబ్బంది సేవలను పూర్తిగా సది్వనియోగం చేసుకోవడంపై ఐటీ సంస్థలు దృష్టి పెడుతున్నాయనేందుకు నిదర్శనం. అయితే, టీసీఎస్‌ మాత్రం ఏఐకి తాజా కోతలకు సంబంధం లేదని చెబుతోంది. కానీ టెక్‌ పరిశ్రమలో సిబ్బంది నియామకాలను ఏఐ, ఆటోమేషన్‌ అనేవి మరింత ప్రభావితం చేస్తున్న తరుణంలో టీసీఎస్‌ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోపక్క, ఇటీవలి ఐటీ కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదాయాల్లో ఏమంత పెద్ద పెరుగుదల లేదు. క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యయాల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు... 

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్‌తో సహా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు.. ఇప్పటికే ఉద్యోగుల తగ్గింపు బాట పట్టాయి. ముఖ్యంగా సరికొత్త డిజిటల్‌ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగ విధులు, నైపుణ్యాలను మదింపు చేస్తూ అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం.. లేదంటే వేటు వేయడానికీ వెనుకాడటం లేదు. ‘మన ఐటీ కంపెనీల విషయానికొస్తే.. సమర్థవంతమైన, పనితీరు ఆధారిత సిబ్బంది విధానాల వైపు మార్పునకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని పాఠక్‌ అభిప్రాయపడ్డారు. 

‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ ఆసరాతో తక్కువ వ్యయానికి మరిన్ని సేవలు కోరుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సంస్థల సిబ్బంది కోతలకు ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ ఆధారిత ఐటీ వైపు మారుతోంది. ప్రస్తుత మానవ నైపుణ్యాలతో పోటీ పడే ఏఐ ఏజెంట్లు.. ఇప్పుడున్న కొంత మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ జోరందుకుంటుంది’ అని టెక్‌ఆర్క్‌ వ్యవస్థాపకుడు ఫైజల్‌ కవూసా అభిప్రాయపడ్డారు. ఐటీ డిమాండ్‌ తగ్గడం, క్లయింట్ల ప్రాధాన్యతలు మారడం వల్ల ఎదురవుతున్న మార్జిన్‌ ఒత్తిళ్లు.. సిబ్బంది కోతకు దారితీస్తున్నాయని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభు రామ్‌ పేర్కొన్నారు.

 నైపుణ్యాలు లేకుంటే ఇంటికే... 

కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు టీసీఎస్‌తో పాటు దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏఐ, ఆటోమేషన్‌ బాట పడుతున్నాయి. మార్జిన్లు పెంచుకోవడానికి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఫలితాలు పొందాలనేది వాటి తాజా వ్యూహం. ప్రతి కంపెనీలో సిబ్బంది, విధానాలు, టెక్నాలజీ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయని టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. ‘కంపెనీలన్నీ తమ ప్రస్తుత సిబ్బందితో పాటు కొత్తగా తీసుకునే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్కిల్స్‌ పెంచుకోకుండా, భవిష్యత్తు విధానానికి అనుగుణంగా లేనివారిపై వేటు తప్పదు. దీర్ఘకాలంలో కంపెనీల్లో అనేక సానుకూల మార్పులతో మాటు కొన్ని ప్రతికూలతలు కూడా తప్పవు’ అని శర్మ అభిప్రాయపడ్డారు.

పరిశీలిస్తున్నాం: ఐటీ శాఖ 

భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న టీసీఎస్‌ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను కేంద్ర ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కారి్మక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను కలిసిన నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (ఎన్‌ఐటీఈఎస్‌), ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీసీఎస్‌కు నోటీసులు ఇవ్వాలని కోరింది. 
 
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement