
అంతర్జాతీయంగా వాణిజ్య అనిషితుల్లోనూ దేశ ఎగుమతుల రంగం పనిష్ట పనితీరు చూపించింది. సెప్టెంబర్‌లో ఎగుమతులు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.74 శాతం అధికంగా 36.38 బిలియన్ డాలర్ల (3.20 లక్షల కోట్లు) విలువ మేర ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం 16.6 శాతం పెరిగి 68.53 బిలియన్ డాలర్లు(రూ.6.03 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు సెప్టెంబర్ నెలకు మరింత విస్తరించి 31.15 బిలియన్ డాలర్లు(రూ.2.74 లక్షల కోట్లు)గా నమోదైంది. 2024 సెప్టెంబర్ నెలలో దిగుమతులు 58.74 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కేంద్ర వాణిజ్య శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.
ప్రధానంగా బంగారం, వెండి, ఎరువుల దిగుమతులు పెరిగిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 3 శాతం పెరిగి 220 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 4.53 శాతం పెరిగి 375.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 155 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న తరుణంలోనూ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. మెరుగైన పనితీరుకు కారణం ఏంటన్న మీడియా ప్రశ్నకు దేశీ పరిశ్రమ బలంగా ఉందంటూ.. తమ సరఫరా వ్యవస్థలను, వ్యాపార సంబంధాలను మెరుగ్గా కొనసాగించినట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్‌ల ప్రభావంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. దీన్ని తెలుసుకునేందుకు కమోడిటీ వారీగా డేటాను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అమెరికాకు మొత్తం ఎగుమతుల్లో 45 శాతానికి టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.