
హైరింగ్‌పై సానుకూలంగా 48 శాతం సంస్థలు
సీఐఐ, జేఎల్‌ఎల్, ట్యాగ్డ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, జేఎల్‌ఎల్ ఇండియాతో కలిసి ట్యాగ్డ్ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 48 శాతం జీసీసీల్లో హైరింగ్‌ను పెంచుకోవడంపై సానుకూల సెంటిమెంటు నెలకొంది. 19 శాతం సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే నియామకాలను కొనసాగించే యోచనలో ఉన్నాయి.
ఇటు ఖర్చులు, అటు సమర్ధత మధ్య సమతౌల్యాన్ని పాటించేలా 1–5 ఏళ్ల అనుభవం గల వారిని రిక్రూట్ చేసుకోవడంపై జీసీసీలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. కెరియర్‌లో పెద్దగా పురోగతి లేకుండా 18–24 నెలల పాటు ఒకే హోదాలో ఉండిపోవడానికి జెనరెషన్ జెడ్ ప్రొఫెషనల్స్ ఇష్టపడకపోతుండటంతో, ఉద్యోగంలో కొనసాగే సగటు వ్యవధి గణనీయంగా తగ్గిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాలవ్యాప్తంగా 100కు పైగా జీసీసీలపై అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది.
ప్రధాన హబ్‌లలోనే రిక్రూట్‌మెంట్..
ప్రధాన హబ్‌లుగా ఉంటున్న నగరాల నుంచే ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని 60 శాతం జీసీసీలు భావిస్తున్నాయి. 29 శాతం సంస్థలు మాత్రం ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల మేళవింపుతో నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. ఇక 13 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రిక్రూట్ చేసుకోనున్నాయి. కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా జీసీసీల్లో నియామకాల ప్రక్రియలో గణనీయంగా మార్పులు వస్తున్నట్లు నివేదిక తెలిపింది. 48 శాతం జీసీసీలు ఏఐ ఆధారిత హైరింగ్ టూల్స్‌ను ఉపయోగించే యోచనలో ఉండగా, ఇప్పటికే 24 శాతం సంస్థలు వివిధ స్థాయుల్లో వాటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.