దేశ విదేశాల్లో విస్తృతంగా ఉద్యోగాలు, ఉపాధి
యువత అభివృద్ధి, సంక్షేమం కోసం శ్రమిస్తున్నాం
ఉద్యోగ జీవితంలో ప్రజాసేవే పరమావధిగా భావించాలి
రోజ్‌గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
61 వేల మందికి నియామక పత్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: మన యువతకు దేశ విదేశాల్లో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా వేర్వేరు దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యువత అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా మన దేశంలోనే ఉందని గుర్తుశారు. వారికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తే దేశం ప్రగతి మరింత వేగవంతమవుతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ శనివారం 18వ రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరిగిన రోజ్‌గార్ మేళాలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 61 వేలమందికిపైగా యువతీ యువకులకు వర్చువల్‌గా నియామక పత్రాలు అందజేశారు. దేశ యువతకు 2026 సంవత్సరం సరికొత్త ఆశలు ఆనందాలతో మొదలైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ నియామక పత్రం కేవలం ప్రభుత్వ ఉద్యోగంలో చేరడానికి అనుమతి మాత్రమే కాదని.. ఇది దేశ నిర్మాణానికి అందిన ఆహ్వానం అని అభివర్ణించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’నిర్మాణానికి కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
నాగరిక్ దేవో భవ
‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో గతంలో ఎదురైన అనుభవాలు గుర్తుచేసుకోవాలి. అలాంటి ఇబ్బందులు ప్రజలకు ఎదురు కాకుండా మనం వారికి సేవ చేయాలి. ఉద్యోగ జీవితంలో ప్రజాసేవే పరమార్థంగా భావించాలి. నాగరిక్ దేవో భవ అనే సూక్తిని పాటించాలి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పౌరుడిని దేవుడిగా పరిగణించాలి. యువత ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. దీనివల్ల నిర్మాణ సంబంధిత రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మన దేశంలో స్టార్టప్‌ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2 లక్షల రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. 21 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. ‘డిజిటల్ ఇండియాతో’నూతన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. యానిమేషన్, డిజిటల్ మీడియాతోపాటు ఇతర రంగాల్లో ఇండియా గ్లోబల్ హబ్‌గా మారుతుండడం హర్షణీయం. యువత కృషి వల్లే ఈ ఘనత సాధ్యమవుతోంది.
సంస్కరణలతో మేలు
నేడు దేశం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లో పయనిస్తోంది. సంస్కరణలతో ప్రజల జీవితాలు, వ్యాపార–వాణిజ్యాలను మరింత సులభతరంగా మార్చాలని నిర్ణయించాం. వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో తదుపరి తరం సంస్కరణలతో యువ పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగుతోంది. చరిత్రాత్మక కార్మిక సంస్కరణల(లేబర్ కోడ్)తో కార్మికులు, ఉద్యోగుల సామాజిక భద్రత బలోపేతమైంది. వ్యాపారవేత్తలకు సైతం లబ్ధి చేకూరుతోంది.
గడిచిన పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతి సాధించింది. దశాబ్ద కాలంలో దేశ జీడీపీ రెట్టింపైంది. 2014 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2.5 రెట్లు పెరిగాయి. పెట్టుబడులు పెరగడమంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే. ఎల్రక్టానిక్స్ తయారీ రంగం 2014 నుంచి ఆరు రెట్లు వృద్ధి చెంది రూ.11 లక్షల కోట్లకు చేరుకుంది. ఎగుమతులు రూ.4 లక్షల కోట్లు దాటాయి’’అని ప్రధానమంత్రి వివరించారు.
మహిళా సాధికారతకు బాటలు
దేశంలో రోజ్‌గార్ మేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. శనివారం నియామక పత్రాలు అందుకున్నవారిలో 8 వేల మందికి పైగా యువతులు ఉన్నారు. గత 11 ఏళ్లలో దేశ వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం దాదాపు రెట్టింపు అయ్యిందని ప్రధాని మోదీ తెలిపారు.
ముద్ర యోజన, స్టార్టప్ ఇండియా వంటి పథకాలు మహిళా సాధికారతకు బాటలు వేశాయని, మహిళా స్వయం ఉపాధి 15 శాతం మేర పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. అంతేకాకుండా మహిళల కొనుగోలు శక్తి పెరగడంతో 2025లో ద్విచక్ర వాహనాల విక్రయాలు 2 కోట్ల మార్కును దాటాయని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణ కోసం రూపొందించిన ‘ఐగాట్’ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటికే 1.5 కోట్ల మంది ఉద్యోగులు చేరారని, కొత్త ఉద్యోగులు కూడా దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


