
డబుల్ డిజిట్ వృద్ధి
ఫలితమిచ్చిన రేట్ల తగ్గింపు
దసరా సందర్భంగా పెరిగిన డిమాండ్
న్యూఢిల్లీ: జీఎస్‌టీ శ్లాబుల క్రమబద్దీకరణ ఫలితంగా కార్ల ధరలు గణనీయంగా తగ్గడంతో సెప్టెంబర్ నెలలో విక్రయాలు బలంగా పుంజుకున్నాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాల్లో చక్కని వృద్ధిని నమోదు చేశాయి. నిర్దేశిత సామర్థ్యం కలిగిన పెట్రోల్, డీజిల్ వాహనాలను 28 శాతం నుంచి 18 శాతం రేటు కిందకు మార్చడం తెలిసిందే. ఎలాంటి లెవీ లేకుండా విలాసవంతమైన కార్లపై 40 శాతం పన్ను విధించడంతో వాటి ధరలు సైతం తగ్గడం అమ్మకాలు పెరిగేందుకు దారితీసింది.
కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. మారుతీ మొత్తం విక్రయాల పరంగా 3% వృద్ధిని నమోదు చేసినప్పటికీ, దేశీయంగా చూస్తే డీలర్లకు సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల డిస్పాచ్ క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8% తగ్గి 1,32,820 యూనిట్లుగా ఉంది.
రిటైల్ విక్రయాలు 27.5 శాతం పెరిగి 1.73 లక్ష లయూనిట్లుగా ఉన్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థోబెనర్జీ తెలిపారు. దసరా నవరాత్రుల్లో మొదటి ఎనిమిది రోజుల్లోనే 1.65 లక్షల యూనిట్లను విక్రయించినట్టు, మరో రెండు రోజుల్లో కలిపి 2 లక్షల యూనిట్ల విక్రయాన్ని అధిగమిస్తామని చెప్పారు.