
ముంబై: లైవ్ ఈవెంట్లు, కాన్సర్ట్‌ల వ్యవస్థ దేశీయంగా గణనీయంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడనుంది. దేశవ్యాప్తంగా ఏటా 100 పైగా భారీ కాన్సర్టులు (కచేరీలు) జరగనున్న నేపథ్యంలో 2030–32 నాటికి 1.2 కోట్ల పైచిలుకు తాత్కాలిక కొలువులు రానున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ ఈ విషయాలు వెల్లడించింది. లైవ్ ఈవెంట్లు, కాన్సర్టులు ఉపాధితోపాటు ఆర్థిక వ్యవస్థకు కూడా చోదకాలుగా ఉంటున్నాయని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు.
కొత్త పరిణామాలతో ప్రొడక్షన్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియావ్యాప్తంగా నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోల్లోనే జరుగుతున్నప్పటికీ, క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా తెరపైకి వస్తున్నాయని అలగ్ చెప్పారు. ‘షిల్లాంగ్, గౌహతి, పుణే, జైపూర్, కొచ్చి, లక్నో, ఇండోర్, చండీగఢ్ లాంటి నగరాలు లైవ్ ఈవెంట్లకు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి’ అని పేర్కొన్నారు.
వివిధ విభాగాల్లో వేల కొద్దీ అవకాశాలు..
ఒక్కో కాన్సర్టుతో వివిధ విభాగాల్లో 15,000 నుంచి 20,000 స్వల్పకాలిక ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఎన్‌ఎల్‌బీ సరీ్వసెస్ తెలిపింది. వేదిక నిర్వహణ, జన సమూహాల నియంత్రణ, ఫుడ్..బెవరేజ్ సరీ్వసులు, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఆర్టిస్టులకు సర్వీసుల్లాంటి విభాగాలు వీటిలో ఉన్నాయి. కాన్సర్ట్ ఎకానమీ అనేది అటు ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ఉదాహరణకు 2024లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీతో స్థానిక ఎకానమీకి రూ. 72 కోట్ల జీఎస్‌టీ సహా రూ. 641 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఫ్లయిట్లకు డిమాండ్ 300–350 శాతం ఎగిసింది. రైళ్ల బుకింగ్స్ 8 శాతం పెరిగాయి. హోటల్ టారిఫ్‌లు రికార్డు స్థాయికి (కొన్ని గదుల టారిఫ్‌లు రోజుకు రూ. 90,000) ఎగిశాయి.
ఫుల్‌టైమ్ కొలువుల్లోకి రూపాంతరం..
ఈ కాన్సర్టుల బూమ్ అనేదిక ఏదో స్వల్పకాలిక వ్యవహారం కాదని, 10–15 శాతం తాత్కాలిక కొలువులు పూర్తి స్థాయి ఉద్యోగాలుగా కూడా మారుతున్నాయని అలగ్ చెప్పారు. ముఖ్యంగా ఆడియో ఇంజనీరింగ్, డిజిటల్ వ్యూహం, ఈవెంట్ టెక్నాలజీ, ప్రొడక్షన్ నిర్వహణ వంటి విభాగాల్లో ఈ ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాజెక్టులు పునరావృతం అవుతుండటం, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ లాంటి అంశాలు దీర్ఘకాలికంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గిగ్ లేదా ఫ్రీలాన్స్ వర్కర్లకు ఉపయోగకరంగా ఉంటోందని అలగ్ చెప్పారు. ఏటా 100 పైగా కాన్సర్టులు ఉంటాయనే అంచనాల కారణంగా రాబోయే కొన్నేళ్లలో వీటిపంగా రూ. 15,000 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. టికెటింగ్, హాస్పిటాలిటీ, రవాణా ద్వారా ప్రత్యక్ష ఆదాయాలు, పర్యాటకం, స్థానికంగా ఉపాధి కల్పన, వంటి అంశాలు ఇందుకు తోడ్పడతాయని అలగ్ చెప్పారు.