2019–24 మధ్య వైఎస్ జగన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 6,26,116
పరిశ్రమల్లో 24,68,146 మందికి ఉద్యోగాల కల్పన
విద్యాశాఖలో 21,608 ఉద్యోగాల భర్తీకి చర్యలు
2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. రద్దు చేసిన చంద్రబాబు సర్కారు
తొలి సంతకంతో డీఎస్సీ ప్రకటించి ఏడాదిన్నర కాలయాపన చేసిన చంద్రబాబు
ఇతర ఉద్యోగాల కల్పన ఊసేలేదు
సాక్షి, అమరావతి: అబద్ధాలు చెప్పడంలో డబుల్ పీహెచ్‌డీలు చేసిన సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ సీఎంను అని చెప్పుకుంటున్న ఆయన హయాంలో డీఎస్సీ తప్ప ఇతర పోస్టులు భర్తీ చేసింది అరకొరే. అదీ తప్పులు చేసి, యువతను మోసం చేసి అభ్యర్థుల కన్నీటికి కారణమయ్యారు. 1998, 2018లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా పోస్టులు భర్తీ చేయలేదు. ఆ అభ్యర్థులకు న్యాయం చేసింది మాత్రం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నీ కలిపి మొత్తం 34,108 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ సీఎంగా 6,26,116 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక వివిధ పరిశ్రమలను స్థాపించి వీటిలో 24,68,146 మందికి ఉద్యోగ అవకాశాలు క ల్పించారు. రెండేళ్లపాటు కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఒక్క విద్యాశాఖలోనే 21,608 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారంటేవిద్యా రంగానికి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు.
తొలి సంతకానికే దిక్కులేని పాలన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గత ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై చేశారు. అయితే 14 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇటీవల అరకొరగా పోస్టులు భర్తీ చేశారు. ఇంకా ఈ భర్తీలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి.
కానీ జగన్ ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన న్యాయ చిక్కులను పరిష్కరించడంతోపాటు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలలో 30,94,262 ఉద్యోగాలను భర్తీ చేసింది.
బాబు జమానాలో చేసింది అరకొరగానే..
చంద్రబాబు పాలనతో ప్రతి నోటిఫికేషన్‌ను వివాదాస్పదంగా మార్చేశారు, ఇందుకు 1998, 2018 డీఎస్సీలే ఉదాహరణ. వాస్తవానికి చంద్రబాబు హయాంలో డీఎస్సీని ఓ పెద్ద నాటకంగా మార్చేశారు. 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టును ఆశ్రయించారు.
ఈ నోటిఫికేషన్‌లో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు 300 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగిలిన పోస్టులను వైఎస్ జగన్ 2021లో న్యాయ వివాదాలు పరిష్కరించి భర్తీ చేశారు. అలాగే, గత ఐదేళ్ల జగన్ పాలనలో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,059 మంది, 2008 అభ్యర్థులు మరో 2,193 మందికి ఎంటీఎస్‌గా విధుల్లోకి తీసుకున్నారు.
స్పెషల్ డీఎస్సీ–2019 ద్వారా 602 మందికి, 2023లో కేజీబీవీల్లో 1,250 మందికి కాంట్రాక్టు విధానంలోను, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీగా మరో 450 మంది.. ఇలా మొత్తం 15,508 పోస్టులు భర్తీ చేశారు. 2024 డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ పోస్టులను నిలిపివేసింది. ఇవికూడా భర్తీ అయితే మొత్తం 21,608 పోస్టులను భర్తీ చేసినట్టు అయ్యేది.
విద్యా సంస్కరణలకు బ్రాండ్ వైఎస్ జగన్
గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడి కీర్తిని ఐక్యరాజ్య సమితిలో నిలబెట్టారు వైఎస్ జగన్. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల్లో 11 రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు టోఫెల్, ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ‘మనబడి: నాడు–నేడు’ ద్వారా రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేశారు.
2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. నాడు–నేడు రెండో దశలో రూ.8000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు.
అంతేగాక దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరు శాతం ప్రభుత్వ బడులను డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతోపాటు సీబీఎస్‌ఈ సిలబస్‌ను సైతం ప్రభుత్వ బడిలో అమలు చేశారు. అలాగే, అంతర్జాతీయంగా పేరు పొందిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్‌ను సైతం అమలు చేసేందుకు బాటలు వేశారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఈ విద్యా సంస్కరణలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం తన కుటిల∙బుద్ధితో ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది.


