2025 జూలై – సెప్టెంబర్ ‘లేబర్ సర్వే’ నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచినట్లు లేబర్ ఫోర్స్ సర్వే తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగిత గణాంకాలతో నివేదిక విడుదల చేసింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు సూపర్ సిక్స్‌లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా హామీని అమలు చేయకపోగా నిరుద్యోగ భృతిని నైపుణ్య శిక్షణతో అనుసంధానం చేశానంటూ మాట మార్చేశారు! దీంతో రాష్ట్రంలో ఉపాధి లభించక నిరుద్యోగిత పెరిగిపోతోంది. ఇదే విషయం లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించింది.
⇒ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 ఏళ్లు పైబడి అన్ని వయసుల వారికి సంబంధించి నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ 8.2 శాతంతో రెండో స్థానంలో ఉంది. అదే జాతీయ సగటు నిరుద్యోగత 5.2 శాతంగా మాత్రమే ఉంది. జాతీయ సగటును మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. అత్యధికంగా 8.9 శాతం నిరుద్యోగంతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో ఉంది.
⇒ గ్రామీణ, పట్టణప్రాంతాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో పురుషుల్లో నిరుద్యోగత 7.2 శాతం ఉండగా మహిళల్లో 10.1 శాతంగా ఉంది. అదే జాతీయ సగటు చూస్తే 5.2 శాతంగా
నమోదైంది.
⇒ రాష్ట్రంలో పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా 8.5 శాతం నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో 7.7 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.
⇒ ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.3 శాతం ఉండగా, మహిళల్లో 10.5 శాతం ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో నిరుద్యోగత 7.0 శాతం ఉండగా, మహిళల్లో నిరుద్యోగత 9.3 శాతం ఉందని నివేదిక పేర్కొంది.
యువత నిరుద్యోగత 21 శాతం
ప్రత్యేకంగా యువతీ యువకుల నిరుద్యోగతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో 29 ఏళ్ల లోపు వయసున్న యువతి యువకుల నిరుద్యోగత 21.0 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. జాతీయ స్థాయిని మించి ఏపీలో నిరుద్యోగత నమోదైంది. జాతీయ స్థాయిలో యువతీ యువకుల్లో నిరుద్యోగత 14.8 శాతం మాత్రమే ఉంది. ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 21.9 శాతం నిరుద్యోగత ఉంది. పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 19.7 శాతం, మహిళల్లో 28.8 శాతం నిరుద్యోగత ఉందని నివేదిక తెలిపింది.


