సమావేశానికి హాజరైన నాలుగు గ్రామాల ప్రజలు
కలికవాయ–కందుకూరు మధ్య రన్‌వే విస్తరణ నిర్ణయంపై జనాగ్రహం
‘రన్‌వే మాకొద్దు.. భూసేకరణ వద్దు’ అనే నినాదంతో ఉద్యమానికి తీర్మానం
ఉద్యమబాట పట్టాలని ప్రకాశం జిల్లా మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ ప్రజల నిర్ణయం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘బలవంతపు భూసేకరణకు అంగీకరించం. రనే వే వద్దు.. భూసేకరణ వద్దు’ అంటూ ప్రకాశం జిల్లా మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ ప్రజలు ఉద్యమబాట పట్టారు. జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేలా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ నుంచి కందుకూరు మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల మేర రన్‌వే ఏర్పాటు చేశారు.
తాజాగా రన్‌వే విస్తరణకు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా భూసేకరణ కోసం చర్యలు చేపట్టింది. బలవంతపు భూసేకరణపై నాలుగు గ్రామాల ప్రజలు కన్నెర్ర చేశారు. తమ అనుమతి లేకుండా భూముల్ని సేకరిస్తే అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భవిష్యత్ కార్యాచరణకు ఉద్యమ కమిటీ తీర్మానం
ఈ అంశంపై మూలగుంటపాడు, కనుమళ్ల, కలికవాయ, సింగరాయకొండ గ్రామాల ప్రజలు సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో శనివారం సమావేశమై ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. తమ గ్రామాల్లోని భూముల్ని ఇచ్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జయంత్ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి పేరిట ప్రజలను తొక్కుకుంటూ వెళ్తామంటే ఉపేక్షించేది లేదన్నారు.
జాతీయ రహదారిపై సుమారు 4 కిలోమీటర్ల దూరం రన్‌వే నిర్మించిన అధికారులు మధ్యలో అండర్‌పాస్ కానీ, సర్వీసు రోడ్డు కానీ నిర్మించలేదని ధ్వజమెత్తారు. అధికారుల చర్యలతో అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, రన్‌వే నిర్మాణం అడ్డుకోవటానికి అండగా ఉంటామన్నారు. రైతు సంఘం నాయకుడు హనుమారెడ్డి మాట్లాడుతూ.. కరేడులో ఇండోసోల్ ప్రాజెక్టుకు వైఎస్సార్‌సీపీ హయాంలో 4 వేల ఎకరాల భూసేకరణ జరపాలని నిర్ణయించగా.. టీడీపీ నాయకులు ఆ ప్రాజెక్టు జగన్ బినామీ కంపెనీ అని ఆరోపించారని గుర్తు చేశారు.
ఇప్పుడు చంద్రబాబు 8 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని, దీనిని బట్టి ఇది ఎవరి బినామీ కంపెనీ అని ప్రశ్నించారు. ఇది కేవలం అదానీ కంపెనీ అని, దానికి మద్దతుగా ప్రధాని మోదీ ఉన్నాడని ఆరోపించారు. సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు మాట్లాడుతూ.. జనావాసాలు గల ప్రాంతంలో రన్‌వే నిర్మాణం ఆమోదయోగ్యం కాదని, వేరే ప్రాంతంలో నిర్మించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. గ్రామసభ జరగకుండా, గ్రామస్తుల సలహా తీసుకోకుండా భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం దారుణమన్నారు.
గతంలో జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ జరిపారని, భూములిచ్చిన రైతులకు పూర్తిగా నగదు చెల్లించలేదని ఆరోపించారు. తిరిగి భూసేకరణ చేస్తామంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రన్‌వేకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో నరాల సుధాకర్, దొడ్డ కరుణాకరరెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిగురుపాటి శేషగిరి, సీఎంఎం నాయకుడు రాము, రైతు సంఘాల నాయకులు, నాలుగు గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.


