లారీ ఢీకొని మహిళ మృతి
● మరొకరికి గాయాలు
మేదరమెట్ల: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల జాతీయరహదారిపై మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే..మార్టూరు మండలం కోనంకి గ్రామానికి చెందిన మెడసరి వెంకటేశ్వర్లు భార్య మల్లేశ్వరితో కలిసి ద్విచక్రవాహనంపై తమ్మవరం గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో తమ్మవరం రోడ్డు నుంచి జాతీయరహదారిపైకి వెళ్లేందుకు సర్వీసు రోడ్డులో వెళ్లి జాతీయరహదారి ఎక్కారు. అదే సమయంలో ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపుకు వెళుతున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో వెనుక కూర్చున్న మల్లేశ్వరి (42) రోడ్డుపై పడిపోగా అమైపె నుంచి లారీ చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. భర్త వెంకటేశ్వర్లుకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకొని క్షతగాత్రున్ని వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టంగుటూరు: చింతకాయలు కోస్తూ ప్రమాదవశాత్తు చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మల్లవరప్పాడు సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాలు మేరకు..మండలంలోని మల్లవరప్పాడు గ్రామానికి చెందిన చౌటూరి చిరంజీవి(35) తండ్రి సింగయ్యతో కలిసి మల్లవరప్పాడు, తూర్పునాయుడుపాలెం గ్రామాల మధ్య చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి చెట్టు మీద నుంచి జారిపడి గాయపడడంతో వెంటనే ఒంగోలులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి సింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గుర్రంవారిపాలెంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మార్టూరు మండలం తాటవారిపాలెం గ్రామానికి చెందిన మర్రి శేషయ్య(65) పనిమీద గుర్రవారంపాలెం గ్రామానికి బైకుపై బయలుదేరారు. గుర్రంవారిపాలెం సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో శేషయ్యకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై ఎటువంటి కేసు నమోదు కాలేదు.
లారీ ఢీకొని మహిళ మృతి


