సింగరాయకొండ: సింగరాయకొండ మండలంలోని శ్రీచైతన్య నవోదయ స్కూలులో ఫిబ్రవరిలో జరిగిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు సయ్యద్ మౌలాబి, ఆలీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తమ కుమారుడు తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారని, ఇది ముమ్మాటికీ అవాస్తవమని తల్లిదండ్రులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ స్కూలు యాజమాన్యం రమణారెడ్డి, ఆయన కుమారుడు చైతన్యకు కొమ్ముకాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యేనని ఆత్మహత్య కాదని చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ జరపకుండా దోషులకు కొమ్ముకాస్తూ వారిని కేసు నుంచి రక్షించే ప్రయత్నం చేస్తున్నారని హైకోర్టుకు తెలిపారు. పంచనామా సమయంలో కూడా సంఘటన జరిగిన ప్రదేశం వద్ద కాకుండా ఒంగోలు జీజీహెచ్ వద్ద పంచనామా చేశారని ఆరోపించారు. మృతదేహాన్ని చూసేందుకు కూడా పోలీసులు అనుమతించలేదని, మృతదేహంపై ఉన్న గాయాలకు ఎలాంటి సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్రంగా విచారించిన హైకోర్టు ఈకేసులో విచారణాధికారులుగా ఉన్న పోలీసులు, ఇతర అధికారుల సెల్‌ఫోన్‌లు, సీసీ టీవీ ఫుటేజ్‌లతో పాటు అన్ని ఆధారాలను భధ్రపరచాలని, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి చేత విచారణ జరిపించాలని, ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఎస్పీ వీ హర్షవర్దన్‌రాజును ఆదేశించింది. తౌషిక్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించటంతో ఈ కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని, ఈ కేసులో మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరించిన ఎస్సై బీ మహేంద్ర, ఇతర అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ప్రకాశం ఎస్పీకి ఆదేశాలు
కేసుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకోవాలని సూచన
కేసును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించిన సీఐ, ఎస్సైపై సమగ్ర విచారణ జరపాలి
పూర్తి నివేదికతో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశం


