జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గౌతమి | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గౌతమి

Apr 4 2026 8:01 AM | Updated on Apr 4 2026 8:01 AM

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా గౌతమి కారు బోల్తా..వ్యక్తి మృతి ఎస్‌ఐఆర్‌ను నిస్పక్షపాతంగా నిర్వహించాలి

ఒంగోలు టౌన్‌: అకుంఠిత దీక్ష, నిరంతరం కృషి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న కసి ఉంటే అసాధ్యమైనదేదీ లేదని నల్లూరి గౌతమి చాటి చెప్పారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలకు చేరుకొని పుట్టిన ఊరికి, తలిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఒంగోలుకు చెందిన నల్లూరి గౌతమి తాజాగా విడుదలైన ఫలితాల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. గతేడాది అక్టోబర్‌లో రాత పరీక్షలు పూర్తి చేసుకున్న ఆమె ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో నిర్వహించిన ఇంటర్వ్యూలో అద్భుత ప్రతిభచాటి సివిల్‌ జడ్జిగా నియాకపత్రాన్ని అందుకున్నారు. ఒంగోలు నగరం మంగమూరులో నివాసం ఉండే గౌతమి తలిదండ్రులు శ్రీనివాసరావు, ఉదయలక్ష్మి ఇద్దరూ ఉపాధ్యాయులు. శ్రీనివాసరావు 2017 గుండెపోటుతో మరణించారు. తల్లి ఉదయలక్ష్మి ప్రస్తుతం పేర్నమిట్ట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. తలిదండ్రులు ఆశయాలను అర్థం చేసుకున్న ఆమె తొలి నుంచి చదువుల్లో రాణించారు. ఒంగోలులోని మాంటిస్సోరి పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మోడల్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేశారు. విశాఖపట్టణంలోని ప్రతిష్టాత్మక దామోదరం సంజీవయ్య నేషనల్‌ లా యూనివర్శిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. ఒకవైపు చదువుకుంటూనే ఏ మాత్రం తీరక దొరికినా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒంగోలులోని భూమి స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యురాలిగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2018లో రాష్ట్ర ప్రభుత్వం గౌతమికి స్వచ్ఛత అవార్డు ఇచ్చి గౌరవించింది. సామాన్యులకు, నిరుపేదలకు సత్వర న్యాయం అందించడమే తన లక్ష్యమని గౌతమి చెప్పారు. నల్లూరి గౌతమి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడంతో స్వగ్రామం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంతో పాటు ఒంగోలులోని మంగమూరు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

కురిచేడు: మండలంలోని పెద్దవరం సమీపంలో శుక్రవారం వేకువ జామున కారు బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శివ కథనం ప్రకారం..పెద్దవరంలో వివాహానికి కారులో హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో కురిచేడు వైపు వెళ్తున్నారు. కారుకు అడవి పంది అడ్డు వచ్చింది. దాన్ని తప్పించబోయి అదుపుతప్పిన కారు.. వాగులో బోల్తా కొట్టింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి కారులో ప్రయాణిస్తున్న నలుగురిని బయటకు తీసి చూడగా హైదరాబాద్‌కు చెందిన శింగనమల నాగేశ్వరరావు (55)కు తీవ్ర గాయాలై కొన ఊపిరితో ఉన్నట్లు గమనించారు. 108 వాహనానికి సమాచారం అందించగా సిబ్బంది నాగేశ్వరరావు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడు నాగేశ్వరరావు హైదరాబాద్‌లో కన్జుమర్‌ రైట్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

మార్కాపురం టౌన్‌: ఎస్‌ఐఆర్‌ (సర్‌)ను రాష్ట్ర ఎన్నికల సంఘం నిస్పక్షపాతంగా నిర్వహించాలని వెల్ఫేర్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఏఎం అబ్దుల్‌ సుభాన్‌, ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ రజాక్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఎంపీజే ఆధ్వర్యంలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్‌ ఇంటెన్సీవ్‌ రివిజన్‌ ) పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని, అయితే ప్రస్తుతం కులం, మతం, పార్టీల పరంగా విభజించబడిందా అనేలా విమర్శలు వస్తున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement