సమ్మెకు రవాణా కార్మికులు మద్దతివ్వాలి
ఒంగోలు టౌన్: సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహమ్మద్ పిలుపునిచ్చారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మంగళవారం రవాణా కార్మికుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెళ్లూరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ అహమ్మద్ మాట్లాడుతూ లేబర్ కోడ్ల పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని దెబ్బతీస్తుందన్నారు. పెట్రోల్ చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం అందుకు బదులుగా రవాణా రంగానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవడం లేదన్నారు. మోడీ పాలనలో రవాణా రంగం కుదేలైపోయిందని విమర్శించారు. నూతన విద్యుత్ చట్టం, విత్తన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచిన ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఎం.రమేష్, తంబి శ్రీనివాసులు, షేక్ ముహమ్మద్, యు.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
● ద్విచక్రవాహనదారుడు మృతి
పెద్దదోర్నాల: ముందు వెళుతున్న టిప్పర్‌ను అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్‌లోని చిన్నారుట్ల వద్ద మంగళవారం జరిగింది. ఈ ఘటనలో తెనాలికి చెందిన విష్ణు మొలకల బ్రహ్మేశ్వరరరావు (50) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకట రమణయ్య హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఎస్సై కథనం మేరకు..మండల కేంద్రం నుంచి ద్విచక్రవాహనంపై శ్రీశైలం వెళుతున్న బ్రహ్మేశ్వరరరావు చిన్నారుట్ల వద్ద తన ముందుగా వెళ్తున్న టిప్పర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా అదే సమయంలో ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బ్రహ్మేశ్వరరరావు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఘాట్‌రోడ్లలో రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ద్విచక్ర వాహనదారులు వేగాన్ని నియత్రించుకుని జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఎస్సై కోరారు.
● పోస్ట్ కార్డుల క్యాంపెయిన్ ద్వారా సీఎంకు వినతి
చీమకుర్తి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం తరఫున ఉపాధ్యాయులు పోస్టుకార్డు క్యాంపెయిన్ కింద పోస్టుకార్డులు రాసి సీఎం చంద్రబాబు నాయుడుకు పోస్టు చేశారు. పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్‌ను ప్రకటించాలని, ఉద్యోగులు, పెన్షనర్‌ల బకాయిల చెల్లింపునకు రూట్ మ్యాప్‌ను ప్రకటించాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, మెమో 57 ప్రకారం 2004కు ముందు నియామక ప్రక్రియ పూర్తయిన వారికి పాత పెన్షన్‌ను అమలు చేయాలన్నారు. హెల్త్ కార్డులు, మెడికల్ బిల్స్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరగనున్న బడ్జెట్ సమావేశాలలో పై సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్ళూరి రోజారావు, చలువాది శ్రీనివాసరావు, జిల్లా, మండల స్థాయి నాయకులు నల్లూరి వెంకటేశ్వరరావు, షేక్ శిలార్ సాహెబ్, పర్వతం వెంకటేశ్వర్లు, మన్నం శ్రీనివాసరావు, పల్లేల రమేష్, స్థానికులు పాల్గొన్నారు.
సమ్మెకు రవాణా కార్మికులు మద్దతివ్వాలి
సమ్మెకు రవాణా కార్మికులు మద్దతివ్వాలి


