
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తృతి అంతటా పెరిగిపోయింది. అన్ని రంగాలను, పరిశ్రమలను ఈ సరికొత్త సాంకేతికత కమ్మేస్తోంది. దీంతో ఉద్యోగాలు, పని చేసే విధానం పూర్తిగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో 16వ ఫిక్కీ గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ 2025లో ఫిక్కీ, కేపీఎంజీలు 'నెక్ట్స్ జనరేషన్ స్కిల్స్ ఫర్ ఎ గ్లోబల్ వర్క్‌ఫోర్స్: ఎనేబుల్ యూత్ అండ్ ఎంపవర్ ఎకానమీ' పేరుతో ఓ కీలక నివేదికను ఆవిష్కరించాయి.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి విడుదల చేసిన ఈ నివేదిక గ్లోబల్ ఏఐ టాలెంట్ హబ్ గా మారడానికి భారతదేశ రోడ్ మ్యాప్ ను వివరిస్తుంది.ప్రాంప్ట్ ఇంజినీర్లు, స్మార్ట్ గ్రిడ్ అనలిస్టులు వంటి సరికొత్త భవిష్యత్ ఉద్యోగాలతో ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో వేగవంతమైన కృత్రిమ మేధ ఆధారిత పరివర్తనను కీలక పరిశోధనలు హైలైట్ చేస్తున్నాయి. అయితే భారతీయ యువతలో కేవలం 26.1% మంది మాత్రమే సరైన వృత్తి శిక్షణను పొందుతున్నారు. ఇది అత్యవసర నైపుణ్య అంతరాలను తెలియజేస్తోంది.
రంగాల వారీగా ఏఐ శిక్షణ, ఐటీఐలను ఆధునీకరించడం, టైర్ 2, 3 నగరాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. అట్టడుగు వర్గాల సాధికారత కోసం గ్లోబల్ సర్టిఫికేషన్ అలైన్ మెంట్, నైతిక ఏఐ ప్రమాణాలు, సమ్మిళిత విధానాలు అవసరమని పేర్కొంది.
కలిసొచ్చే అంశాలు
భారతదేశంలో ఎక్కువగా ఉన్న యువ జనాభా, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్ మనం ఏఐ వర్క్‌ఫోర్స్‌లో నిర్ణయాత్మకమైన శక్తిగా ఎదగడానికి సానుకూల అంశాలుగా కేపీఎంజీకి చెందిన నిపుణులు పేర్కొన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, సాహసోపేతమైన సంస్కరణలతో, భారత్ ఏఐ నిపుణులను బయటి దేశాలకు అందించగలదని అభిప్రాయపడ్డారు.