
ఆదుకోవడంపై కేంద్రం ఫోకస్
ఎగుమతిదార్లతో వాణిజ్య శాఖ సంప్రదింపులు
రసాయనాలు, టెక్స్‌టైల్స్ తదితర పరిశ్రమలకు ప్రాధాన్యత
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిశ్రమలకు ఊరటనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద రసాయనాలు, టెక్స్‌టైల్స్‌లాంటి రంగాలకు చేయూతనిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రంగాల ఎగుమతిదార్లతో భేటీ అయిన సందర్భంగా టారిఫ్‌ల ప్రభావాలు, సహాయక చర్యలకు అవకాశాలు తదితర అంశాల గురించి వాణిజ్య శాఖ చర్చించినట్లు వివరించాయి.
కేంద్ర బడ్జెట్‌లో రూ. 2,250 కోట్లతో ప్రతిపాదించిన ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద టారిఫ్ ప్రభావిత రంగాలకు తోడ్పాటు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి.
ఈ మిషన్ కింద చిన్న–మధ్య తరహా సంస్థలు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభ రుణ పథకాలు, విదేశాల్లో వేర్‌హౌసింగ్ సదుపాయాల కల్పన, ఎగుమతి అవకాశాలను దక్కించుకునేందుకు గ్లోబల్ బ్రాండింగ్‌కి సహాయం అందించడం మొదలైనవి ఉంటాయని అంచనా. అమెరికాకు టెక్స్‌టైల్స్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లుగా, రసాయనాల ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వస్త్రాలు, రత్నాభరణాలు, రొయ్యలు, లెదర్.. ఫుట్‌వేర్, రసాయనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మె కానికల్ పరికరాలు మొదలైన రంగాలపై 50% టారిఫ్‌ల ప్రభావం గణనీయంగా ఉండనుంది.
సంస్కరణలకు జీజేఈపీసీ విజ్ఞప్తి..
సుంకాల భారం తగ్గేలా తక్షణం పాలసీపరమైన సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ కోరింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీము, మార్కెట్ డైవర్సిఫికేషన్ కోసం ఆర్థిక సహాయం అందించడంలాంటి చర్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కట్, పాలిష్డ్ డైమండ్లలో సగం ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయని, భారీ టారిఫ్‌ల వల్ల మొత్తం పరిశ్రమ స్తంభించిపోయే ముప్పు ఏర్పడిందని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వివరించారు.
తక్కువ టారిఫ్‌లు ఉండే టర్కీ, వియత్నాలాంటి దేశాలతో అమెరికా మార్కెట్లో భారత్ పోటీపడటం కష్టతరమవుతుందని భన్సాలీ చెప్పారు. దీన్ని పరిష్కరించకపోతే, అమెరికాకు కీలక సరఫరాదారుగా భారత్‌కి ఉన్న హోదా పోతుందని వివరించారు. అయితే, టారిఫ్‌ల ఎఫెక్ట్‌ను పక్కన పెడితే దేశీయంగా ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, వచ్చే రెండేళ్లలో 130 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు పరిశ్రమకు కాస్త ఊరటనిచ్చే విషయమని భన్సాలీ చెప్పారు. అమెరికాకు భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి.