న్యూఢిల్లీ: దేశీయంగా 1,000 వాహన తుక్కు కేంద్రాలు, 400 ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్ట్ సెంటర్లు అవసరమని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 85 స్క్రాపింగ్ సెంటర్లకు ప్రభుత్వం అనుమతిన్చినట్లు ’డిజిఈఎల్‌వీ’ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన వివరించారు.
జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీ అనేది అన్ని వర్గాలకు ప్రయోజనకరమని, దక్షిణాసియాలో భారత్ స్క్రాపింగ్ హబ్‌గా ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాహన స్క్రాపింగ్ కోసం వాహనదారుకు స్క్రాపింగ్ కేంద్రం (ఆర్‌వీఎస్‌ఎఫ్) జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)లను ట్రేడింగ్ చేసుకునేందుకు డిజిఈఎల్‌వీ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది.
గత మూడు నెలలుగా బీటా ఫేజ్‌లో ఉన్న డిజిఈఎల్‌వీ దాదాపు 800 సర్టిఫికెట్ల ట్రేడింగ్‌కు తోడ్పడింది. పాతబడిన, ఫిట్‌నెస్ కోల్పోయిన, కాలుష్యకారక వాహనాలను దశలవారీగా తప్పించేందుకు 2021 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ వాహన స్క్రాపేజీ పాలసీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం పాత వాహనాలను స్క్రాపింగ్ చేసిన వారు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్‌లో పాతిక శాతం వరకు రిబేటు పొందవచ్చు. ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.


