ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్‌  | India IT Firms Scale Up AI, Earn 10-12 Billion dollars In Services Revenue | Sakshi
Sakshi News home page

ఐటీ ఆదాయాలకు ఏఐ బూస్ట్‌ 

Jun 28 2026 4:47 AM | Updated on Jun 28 2026 4:47 AM

India IT Firms Scale Up AI, Earn 10-12 Billion dollars In Services Revenue

ఇప్పటికే 10–12 బిలియన్‌ డాలర్ల రెవెన్యూ 

నాస్కామ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సేవల రంగంలో దాదాపు పావు శాతం పైగా కంపెనీలు కృత్రిమ మేథ (ఏఐ)పై ప్రయోగాలు చేసే దశ నుంచి వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం వైపు మళ్లాయి. తద్వారా ఆ సంస్థలు ఇప్పటికే ఏఐ సర్వీసుల ద్వారా 10–12 బిలియన్‌ డాలర్ల ఆదాయాలను ఆర్జిస్తున్నాయి. దేశీ ఐటీ సంస్థల  సమాఖ్య నాస్కామ్‌ న్యూయార్క్‌ సిటీలో నిర్వహించిన సీఈవోల సదస్సులో పరిశ్రమ దిగ్గజాలు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

 ఏఐ వినియోగం పెరగడం వల్ల సంప్రదాయ ఐటీ సేవలకు ప్రాధాన్యం తగ్గిపోతుందన్న ఆందోళనలను వారు తోసిపుచ్చారు. ఐటీ వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, పదే పదే పునరావృతమయ్యే పనులను చేయడం తగ్గుతుందని వివరించారు.

. ఏఐ గవర్నెన్స్, అప్లికేషన్ల ఆధునీరణ, సైబర్‌సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్‌ పెరుగుతుందని నాస్కామ్‌ తెలిపింది. ఏఐలో శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌ 20 లక్షల మంది పైగా ఉండగా, అధునాతన ఏఐలో ట్రైనింగ్‌ తీసుకున్న వారు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉంటారని పేర్కొంది. ప్రస్తుతం 85 శాతం టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వద్ద ఏజెంటిక్‌ ఏఐ ప్లాట్‌ఫాంలు ఉన్నట్లు వివరించింది.  

ఏజెంటిక్‌ ఏఐతో టెక్‌ సేవలకు డిమాండ్‌ 
ఏజెంటిక్‌ ఏఐతో సైబర్‌సెక్యూరిటీ, గవర్నెన్స్, కార్యకలాపాల ఆధునీకరణ తదితర విభాగాల్లో డిమాండ్‌ నెలకొంటుందని నాస్కామ్‌ తెలిపింది. దీనితో 2030 నాటికి టెక్నాలజీ సర్వీసులపై 300 – 400 బిలియన్‌ డాలర్ల మేర అదనంగా వెచ్చించే అవకాశం ఉందని వివరించింది. ఏఐని వినియోగంలోకి తెచ్చే క్రమంలో టెక్నాలజీని బాధ్యతాయుతంగా విస్తరించేందుకు కంపెనీలకు స్పెషలిస్ట్‌ పార్ట్‌నర్లు అవసరమవుతారని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ నంబియార్‌ తెలిపారు. 

మోడల్స్, అప్లికేషన్స్, డేటా ప్లాట్‌ఫామ్‌లు, సైబర్‌సెక్యూరిటీ నియంత్రణలు, పరిశ్రమ వ్యవస్థలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానించే విశ్వసనీయమైన మోడల్‌ని రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదంతా కూడా సురక్షితంగా, సమర్ధవంతంగా జరిగేలా చూడటంలోనే ఐటీ సర్వీసుల అసలు సామర్థ్యాలు బైటపడతాయని చెప్పారు. 

రాబోయే రోజుల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోవడం కాకుండా డొమైన్‌  సంబంధ సొల్యూషన్స్‌ కనుగొనడం, ఫలితాలను కచ్చితంగా డెలివర్‌ చేయడంపైనే ఐటీ పరిశ్రమ వృద్ధి ఆధారపడి ఉంటుందని నంబియార్‌ తెలిపారు. బిజినెస్‌ ప్రాసెస్‌ సర్వీసులనేవి పనులను రొటీన్‌గా చేయడం కాకుండా తెలివిగా పూర్తి చేసే విధానాలకు మళ్లుతాయని కాగి్నజెంట్‌ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement