
భారత్ ఇటీవలే జపాన్‌ను అధిగమించి.. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక మన ముందు ఉన్న లక్ష్యం జర్మనీని అధిగమించడమే. ఈ తరుణంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) వచ్చే ఆర్ధిక సంవత్సరంలో దేశ ఆర్ధిక వ్యవస్థ ఎలా ఉంటుందనే విషయాన్ని'2024-2025 వార్షిక నివేదిక'లో వెల్లడించింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. అంతే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని.. తద్వారా స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని నివేదికలో వెల్లడించింది.
మార్కెట్ అస్థిరతలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య విచ్ఛిన్నం, సరఫరా గొలుసుల అంతరాయాలు, వాతావరణ ప్రేరిత అనిశ్చితులు మొదలైనవన్నీ ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఆర్థిక ఏకీకరణ మార్గంలో ప్రభుత్వం నిరంతరం మూలధనంపై దృష్టి పెట్టడం, వినియోగదారులు & వ్యాపార ఆశావాదాన్ని బలోపేతం చేయడం, బలమైన స్థూల ఆర్థిక ప్రాథమిక అంశాలన్నీ సజావుగా ముందుకు సాగితే.. 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఆశాజనకంగానే ఉందని స్పష్టం చేసింది.
2025-26లో వ్యవసాయ రంగానికి అవకాశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా.. ఉత్పాదకతను పెంచే ప్రభుత్వ విధానాలు కూడా అని ఆర్‌బీఐ పేర్కొంది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ కొత్త చొరవలను ప్రకటించారని కూడా వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇక భారత్ టార్గెట్ జర్మనీ: 2027 నాటికి..
టారిఫ్ విధానాలలో మార్పులు ఆర్థిక మార్కెట్లలో అప్పుడప్పుడు అస్థిరతలకు దారితీయవచ్చు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్.. మేక్ ఇన్ ఇండియా వంటివి తయారీ రంగాన్ని మరింత బలపరుస్తాయి. తద్వారా.. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
భారత్ ఇప్పటికే అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఇందులో యూఎస్ఏ మాత్రమే కాకుండా.. ఒమన్, పెరూ, ఈయూ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ వాణిజ్య ఒప్పందాలు ఆర్ధిక వృద్ధికి దోహదపడతాయి. 2024-25లో దేశంలో అనేక ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ.. ఆర్ధిక వ్యవస్థ బలంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులు కూడా దేశంలో అధికంగా ఉన్నాయి. మొత్తం మీద భారత్ ఆర్ధిక వ్యవస్థలో పురోగతి ఉంటుందని ఆర్‌బీఐ వెల్లడించింది.
वर्ष 2024-25 के लिए वार्षिक रिपोर्ट
Annual Report for the Year 2024-25
5thhttps://t.co/vTNI6w2xnz pic.twitter.com/rqo7ZV6HnD— ReserveBankOfIndia (@RBI) May 29, 2025