
ఈసారి వృద్ధి రేటు 6 శాతానికి పరిమితం
మూడీస్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ: అమెరికా ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్‌లను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పై ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 బేసిస్ పాయింట్లు నెమ్మదించి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, సరీ్వసుల రంగం పటిష్టంగా ఉండటం వంటి అంశాలు భారత్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంది. భారీ అమెరికా టారిఫ్‌లపై భారత్ స్పందించే తీరే అంతిమంగా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని వివరించింది.
‘భారత్ ఎగుమతులకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా ఉంటోంది. అలాంటప్పుడు అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరిస్తున్నా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తే 2025–26లో భారత జీడీపీ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర నెమ్మదించవచ్చు‘ అని మూడీస్ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్‌పై అమెరికా టారిఫ్‌లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంతో ఇరు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి.
ఆసియా–పసిఫిక్ దేశాలతో పోటీ..
అమెరికా విధానాల్లో మార్పుల వల్ల సరఫరా సిస్టంలు పునర్‌వ్యవస్థీకరణకు లోనవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వాటా కోసం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని పలు దేశాలు పోటీపడుతున్నాయని తెలిపింది.2025 తర్వాత మిగతా ఆసియా–పసిఫిక్ దేశాలతో పోలిస్తే టారిఫ్‌ల అంతరాలు భారీగా పెరిగిపోవడం వల్ల తయారీ రంగ హబ్‌గా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు గండి పడొచ్చని మూడీస్ పేర్కొంది. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడుల రూపంలో ఒనగూరిన కొన్ని ప్రయోజనాలు కూడా వెనక్కి తరలిపోవచ్చని తెలిపింది. అయితే, అంతర్జాతీయ ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి భారత్ వద్ద ప్రస్తుతం తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించింది.