జీడీపీ వృద్ధి 6.3 శాతమే | India FY26 GDP growth forecast cut to 6. 3 percent from 6. 5 percent | Sakshi
Sakshi News home page

జీడీపీ వృద్ధి 6.3 శాతమే

May 3 2025 3:01 AM | Updated on May 3 2025 3:01 AM

India FY26 GDP growth forecast cut to 6. 3 percent from 6. 5 percent

2025–26 అంచనాలకు ఎస్‌అండ్‌పీ మళ్లీ కోత 

వాణిజ్య విధానాలపై అస్పష్టత వల్లే 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ మరోసారి తగ్గించింది. గత అంచనాలను 0.2 శాతం మేర తగ్గించి 6.3 శాతంగా ప్రకటించింది. 2026–27లో 6.5 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. అమెరికా వాణిజ్య విధానాల్లో నెలకొన్న అనిశ్చి తులు ప్రభావం చూపించొచ్చని తెలిపింది. రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో దీన్నుంచి ప్రయోజనం పొందే విజేతలు ఎవరూ ఉండరని పేర్కొంది.

చైనా జీడీపీ సైతం 2025లో 0.7 శాతం మేర తగ్గిపోయి 3.5 శాతానికి.. 2026లో మరింత తగ్గి 3 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనూ ఎస్‌అండ్‌పీ 2025–26 సంవత్సరం భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించడం గమనార్హం. వృద్ధి అంచనాలకు కోత పెట్టడం ఇది రెండోసారి. అంచనాలకు మించి టారిఫ్‌ల వల్ల ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు నిదానిస్తుందన్న దానిపైనే తమ ప్రాథమిక వృద్ధి అంచనాలు ఆధారపడి ఉంటాయని ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది.  

88కి రూపాయి.. 
2025 చివరికి డాలర్‌ మారకంలో రూపాయి విలువ 88 వద్ద స్థిరపడొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల ప్రకటన తర్వాత డాలర్‌–రూపాయి మారకంలో తీవ్ర ఆటుపోట్లు నెలకొనడం తెలిసిందే. ప్రస్తుతం 84 స్థాయిలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 1.5 శాతం, 2026లో 1.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ విధానాలను మూడు బకెట్లుగా పేర్కొంది. చైనాతో దీర్ఘకాలంగా ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దాన్ని విడిగాను, ఐరోపా యూనియన్‌తో సంక్లిష్టంగా ఉండొచ్చని తెలిపింది. మిగిలిన దేశాలు ప్రతీకార చర్యలకు బదులు చర్చల ద్వారా అమెరికాతో ఒప్పందానికి రావచ్చని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలపై టారిఫ్‌ల వాస్తవ ప్రభావాన్ని చూడాల్సి ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement