
తోడైన పండుగల డిమాండ్
25 శాతం పెరిగిన అమ్మకాలు
ప్రీమియం కొనుగోళ్లకు ఆసక్తి
రెడ్‌సీర్ అధ్యయనంలో వెల్లడి
జీఎస్‌టీ శ్లాబుల క్రమబద్దీకరణతో నిత్యావసర వస్తువల దగ్గర్నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల వరకు ధరలు దిగిరావడం పండుగల సమయంలో ఈ–కామర్స్ మార్కెట్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. మెట్రోపాలిటన్, కీలక మార్కెట్లలో ఈ–కామర్స్ అమ్మకాలు 23–25 శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ పరిశోధన సంస్థ రెడ్‌సీర్ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. 32 అంగుళాలకు మించిన టీవీలు, ఫర్నీచర్, ఫ్యాషన్ ఉత్పత్తులపై రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కంపెనీలు వినియోగదారులకు బదలాయించాయి. ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరావడంతో సంప్రదాయ డిస్కౌంట్ తగ్గింపులకు పరిమితం కాకుండా, తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఖరీదైన కొనుగోళ్లకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విచక్షణారహిత కొనుగోళ్లకు జీఎస్‌టీ సంస్కరణలు ప్రేరణనిచ్చినట్లు పేర్కొంది.
8 శాతం తగ్గిన టీవీ ధరలు
పెద్ద సైజు టీవీలపై జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి విక్రయ ధరలు 6–8 శాతం వరకు తగ్గినట్టు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్ పెరిగినట్టు రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. ఫ్యాషన్ వ్రస్తాలపై (రూ.2,500లోపు ఉన్నవి) జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించడంతో మధ్య శ్రేణి ధరల దుస్తుల అమ్మకాలు పెరిగినట్టు పేర్కొంది. ఫరి్నచర్‌పైనా జీఎస్‌టీ 5 శాతానికి దిగి రావడంతో వినియోగదారులు తమ షాపింగ్ కార్టుల్లో వీటికీ చోటిస్తున్నట్టు వెల్లడించింది. జీఎస్‌టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేసి వాటిల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం కిందకు తీసుకురావడం తెలిసిందే. పొగాకు ఉత్పత్తులు, విలాస వస్తువులు కొన్నింటిపై మాత్రం 40 శాతం జీఎస్‌టీని ప్రతిపాదించారు. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి.
అనూహ్య డిమాండ్..
‘మొదటి రెండు రోజులు అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 23–25 శాతం వరకు పెరిగాయి. జీఎస్‌టీ 2.0కి, పండుగల డిమాండ్ తోడైంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, టీవీల కొనుగోళ్లు పెరిగాయి. డిమాండ్ బలంగా ఉందని యూజర్ల అభిప్రాయాల ఆధారంగా తెలుస్తోంది. కొనుగోలుకు ఒకేసారి ఎక్కువ మంది ఆసక్తి చూపించడంతో కొన్ని యాప్‌లు క్రాష్ కావడం, నిదానించడం కనిపించింది. ఫ్లాష్ డీల్స్‌కు తోడు ముందస్తు డిస్కౌంట్లను సొంతం చేసుకునేందుకు యూజర్లు ఆసక్తి చూపించారు’ అని రెడ్‌సీర్ నివేదిక తెలిపింది. అమెజాన్ ఈ నెల 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలు ప్రారంభించగా, మొదటి రెండు రోజుల్లోనే 38 కోట్ల కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను సందర్శించినట్టు ప్రకటించింది. 70 శాతం డిమాండ్ టాప్–9 పట్టణాలకు వెలుపలి నుంచే ఉన్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!
స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు, క్యూఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ టీవీలు, అత్యాధునిక వాషింగ్ మెషిన్లు, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. టైర్ 2, 3 పట్టణాలకు చెందిన చిన్న, మధ్యస్థాయి సంస్థల అమ్మకాలు (అమెజాన్ ద్వారా) మూడు రెట్లు పెరిగినట్టు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. మరో ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో విక్రయాలు మొదలు పెట్టగా, మొదటి 48 గంటల్లో 21 శాతం అధికంగా యూజర్లు తమ ప్లాట్‌ఫామ్‌కు విచ్చేసినట్టు ప్రకటించింది. మొబైళ్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ 26 శాతం పెరిగినట్టు తెలిపింది. మెట్రోలతోపాటు ఇండోర్, సూరత్, వారణాసి తదితర పట్టణాల నుంచి సైతం డిమాండ్ కనిపించినట్టు పేర్కొంది.