టాయ్‌ పరిశ్రమకు ‘టారిఫ్‌’ల ప్రయోజనం! | how Tariffs impact on the toy industry | Sakshi
Sakshi News home page

టాయ్‌ పరిశ్రమకు ‘టారిఫ్‌’ల ప్రయోజనం!

Apr 8 2025 8:22 AM | Updated on Apr 8 2025 8:22 AM

how Tariffs impact on the toy industry

చైనా, వియత్నాంపై అధిక సుంకాల ఎఫెక్ట్‌..

న్యూఢిల్లీ: ట్రంప్‌ టారిఫ్‌ వార్‌ సెగ అన్ని దేశాలకూ గట్టిగానే తగులుతోంది. అయితే భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాం తదితర పోటీ దేశాలపై అధిక సుంకాలు విధించడం మన టాయ్‌ పరిశ్రమ దీన్ని సదావకాశంగా మలుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇతర దేశాల సంస్థలతో జాయింట్‌ వెంచర్‌ల ఏర్పాటు ద్వారా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశీ కంపెనీలు ఇప్పటికే పని మొదలు పెట్టాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇతర దేశాలపై అధిక టారిఫ్‌ల ప్రభావంతో మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుందని, దీంతో ఈ వాణిజ్య యుద్ధంలో భారత్‌ విజయం సాధించనుందని కూడా వారు అంటున్నారు.

ఆసియాలో చైనాపై 54 శాతం, బంగ్లాదేశ్‌పై 37 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం, ఇండోనేషియాపై 32 శాతం చొప్పున ట్రంప్‌ భారీగా సుంకాలను వడ్డించిన సంగతి తెలిసిందే. భారత్‌పై మాత్రం 26 శాతం టారిఫ్‌లతో సరిపెట్టారు. ‘ఇది మనకు భారీగా అవకాశాలను అందించనుంది. ఎందుకంటే వియత్నాం 6 బిలియన్‌ డాలర్లు, చైనా 80 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. భారతీయ టాయ్స్‌తో పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్‌ సంస్థలన్నీ భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాయి’ అని ప్లేగ్రో టాయ్స్‌ ఇండియా సీఈఓ మను గుప్తా పేర్కొన్నారు.

34.8 కోట్ల డాలర్ల ఎగుమతులు..

పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లుగా భారత్‌ నుంచి 32.6–34.8 కోట్ల డాలర్ల విలువైన టాయ్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికాతో వీలైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ టాయ్‌ సంస్థలు యూఎస్‌కు తమ ఎగుమతులను పెంచేందుకు దోహదం చేస్తుందని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఇప్పుడు రంగాల వారీగా పాలసీలను రూపొందిస్తున్నాయన్నారు. కాగా, బడ్డెట్లో టాయ్‌ పరిశ్రమ కోసం ప్రకటించిన జాతీయ యాక్షన్‌ ప్లాన్‌ ఈ రంగానికి మరింత దన్నుగా నిలవనుందని సన్‌లార్డ్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ అమితాభ్‌ ఖర్బందా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అప్పుల కుప్పలుగా రాష్ట్రాలు

ఇతర దేశాల ఆధిపత్యంతో భారత్‌ అనేక ఏళ్లుగా నికర టాయ్స్‌ దిగుమతిదారుగానే కొనసాగుతోంది. గడిచిన దశాబ్దకాలానికి పైగా చైనా పైనే పూర్తిగా ఆధారపడుతూ 76 శాతం మేర టాయ్స్‌ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. 2012–13లో భారత్‌ చైనా నుంచి 21.4 కోట్ల డాలర్ల టాయ్స్‌ దిగుమతి చేసుకోగా, 2023–24లో ఇది 4.16 కోట్ల డాలర్లకు దిగొచి్చంది. అంటే దాదాపు 94 శాతం దిగుమతలు కాస్తా, 64 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ టాయ్‌ మార్కెట్లో భారత్‌ పోటీతత్వానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement