ట్రంప్‌ రేటింగ్‌ ఢమాల్‌ | Trump approval falls to 33 Percent and lowest of his presidency | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ రేటింగ్‌ ఢమాల్‌

Aug 19 2026 4:56 AM | Updated on Aug 19 2026 4:56 AM

Trump approval falls to 33 Percent and lowest of his presidency

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రజా ఆమోద రేటింగ్‌ 33 శాతానికి పడిపోయింది. ఇది ఆయన ప్రస్తుత పదవీకాలంలో అత్యంత కనిష్ట స్థాయి. వలస విధానాలు, వాణిజ్య పరమైన సుంకాల ప్రభావం కూడా ఆయన రేటింగ్‌ పడిపోవడానికి కారణమయ్యాయి. కేవలం 33 శాతం మంది మాత్రమే ట్రంప్‌ పనితీరును ఆమోదించారు. ఇది ఆయన మొదటి పదవీకాలంలో, డిసెంబర్‌ 2017లో నమోదైన అత్యల్ప స్థాయికి సమానం. 2025లో దేశంలో దాదాపు సగం మంది అధ్యక్ష పదవికి ఆమోదం తెలిపారు. అయితే, ఇటీవల నాలుగు రోజుల పాటు నిర్వహించిన పోల్‌లో, 64 శాతం మంది అమెరికన్లు ఆయన పనితీరును వ్యతిరేకిస్తున్నట్లు తేలింది.  

ఆర్థిక విధానాలు.. వలసలు.. 
పెరుగుతున్న ధరలు, నిత్యావసరాల భారం, ద్రవ్యోల్బణం నియంత్రణలో ప్రభుత్వం విఫలమవ్వటం వలన ఆర్థిక విధానాల్లో ట్రంప్‌ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహించగలరనడంలో ఓటర్లు అధికార రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. డెమొక్రాట్లే ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా నిర్వహిస్తారని 38 శాతం మంది భావిస్తుండగా, 35 శాతం మంది రిపబ్లికన్ల విధానాన్ని ఇష్టపడుతున్నారు. వలసల విషయంలో డెమొక్రాట్ల విధానం కంటే రిపబ్లికన్ల విధానానికే ఒకింత ఎక్కువ ప్రజాదరణ లభించింది.

 అయితే, ప్రాణాంతక ఘర్షణలు, పిల్లలతో సహా నిర్బంధంలో ఉన్నవారి సంఖ్య పెరగడంతో రిపబ్లికన్లు తమ పట్టును కోల్పోతున్నారు. వలస విధానంపై రిపబ్లికన్ల విధానమే మెరుగైనదని సుమారు 40 శాతం అంటుండగా.. 38 శాతం మంది డెమొక్రాట్లను ఎంచుకున్నారు. ఈ 2 శాతం పాయింట్ల వ్యత్యాసం ట్రంప్‌ పదవీకాలంలోనే అత్యల్పం. వీటికి తోడు అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా ఇరాన్‌తో కొనసాగుతున్న దీర్ఘకాలిక యుద్ధంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు, రిపబ్లికన్లలో సగం మంది మాత్రమే ఈ యుద్ధం విలువైనదని భావిస్తున్నారని పోల్‌ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement