గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు! | how Sudhir Jatia Safari struggling brand into 12000 cr | Sakshi
Sakshi News home page

గెంటేశారనే కోపంతో రూ.12వేల కోట్ల కంపెనీ ఏర్పాటు!

Nov 8 2025 1:57 PM | Updated on Nov 8 2025 3:51 PM

how Sudhir Jatia Safari struggling brand into 12000 cr

అవమానాలు జరిగిన చోటే సత్తా ఏంటో చూపించాలని పెద్దలు చెబుతుంటారు. సరిగ్గా సుధీర్‌ జాటియా జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు తాను నడిపిన సంస్థ నుంచి కొన్ని కారణాల చేత తనను బయటకు పంపించారనే ఆరోపణలున్నాయి. దాంతో అదే రంగంలో అంతకుమించిన శక్తిగా ఎదిగాలనుకున్నారు. ఫలితంగా ఇప్పటికే ఆ రంగంలో లాభాలులేక కొట్టుమిట్టాడుతున్న ఓ కంపెనీని కొనుగోలు చేసి తనను బయటకు పంపిన కంపెనీకి అతిపెద్ద పోటీదారుగా మారారు. ఓటమిని గెలుపు మెట్టుగా మార్చుకున్న సుధీర్ జాటియా వ్యాపారం ప్రయాణం తెలుసుకుందాం.

దాదాపు రెండు దశాబ్దాల పాటు సుధీర్‌ జాటియా ఒకే పరిశ్రమలో, అందులోనూ వీఐపీ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థలో కీలక పాత్ర పోషించారు. అయితే, 2010లో ఆ సంస్థ నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు సుధీర్ జాటియా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అంతటితో నిరాశ చెందకుండా ఒక కొత్త లక్ష్యానికి పునాది వేశారు. ఆయన కొనుగోలు చేసిన సఫారీ ఇండస్ట్రీస్‌ నేడు రూ.12,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగి భారీ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.

ముంబై నగరంలో జన్మించిన సుధీర్ జాటియా ముంబై విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన జీవితంలో తొలి వ్యాపార అనుభవం తండ్రి నిర్వహించిన టెక్స్‌టైల్ వ్యాపారంతో మొదలైంది. 1988లో ఆయన తండ్రి, దిలీప్ పిరమల్ (వీఐపీ) సంయుక్తంగా అరిస్టోక్రాట్ (Aristocrat) అనే లగేజ్ కంపెనీని కొనుగోలు చేశారు. దాంతో 21 ఏళ్ల వయసులో జాటియా కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అరిస్టోక్రాట్, VIP వంటి పెద్ద సంస్థల మధ్య పనిచేస్తూ ఆయన కేవలం రెండేళ్లలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎదిగారు.

ఊహించని మలుపు

తన కుటుంబ ప్రయోజనాలను కాపాడుకుంటూ వ్యాపారంలో నైపుణ్యం సంపాదించిన సుధీర్ జాటియా 2003లో వీఐపీ, అరిస్టోక్రాట్ రెండింటికీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆ సంస్థను భారతదేశంలోనే అతిపెద్ద లగేజ్ సామ్రాజ్యంగా నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారు. అయితే, 2010లో VIP వ్యవస్థాపకుల్లో కొందరు తమ కుటుంబ సభ్యులను(తరువాతి తరం) సంస్థ నాయకత్వంలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవడంతో జాటియాను ఆ కంపెనీ నుంచి పంపించాలని నిర్ణయించిట్లు ఆరోపణలున్నాయి(వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు). జీవితంలో కష్టపడి పనిచేసిన సంస్థ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మనసులో బలమైన సంకల్పం ఏర్పడింది.

సఫారీ

వీఐపీ నుంచి బయటకు వచ్చిన తరువాత సుధీర్ జాటియాకు తన వ్యాపార నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే కసి పెరిగింది. ఆయన దృష్టి అప్పటికే మార్కెట్‌లో బలహీనంగా ఉన్న సఫారీ ఇండస్ట్రీస్ (Safari Industries)పై పడింది. 2011లో జాటియా కేవలం రూ.29 కోట్లతో సఫారీ ఇండస్ట్రీస్‌లో 56% వాటాను కొనుగోలు చేశారు. ఆ సమయంలో సఫారీ కంపెనీ మొత్తం విలువ రూ.55 కోట్లు మాత్రమే. సఫారీ అమ్మకాలు అప్పటివరకు ఎక్కువగా సైనిక క్యాంటీన్లపై ఆధారపడి ఉండేవి. ఆయన మొదటగా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచాలనే నిర్ణయం తీసుకున్నారు. నాణ్యత లేనిదే మార్కెటింగ్ పనికిరాదని గట్టిగా నమ్మారు.

ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు సంబంధించి VIP వంటి పాత కంపెనీలు సంకోచిస్తున్న సమయంలో సుధీర్ జాటియా ముందడుగు వేసి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పరచుకున్నారు. ఆన్‌లైన్ ప్రకటనలపై భారీగా పెట్టుబడి పెట్టారు. ఇది సఫారీకి మార్కెట్‌లో విపరీతమైన వృద్ధిని అందించింది.

రూ.12,000 కోట్ల సామ్రాజ్యం

తన అనుభవం, మార్కెట్‌పై ఉన్న పట్టు, ముక్కుసూటి నిర్ణయాలతో సుధీర్ జాటియా సఫారీని అనూహ్యంగా వృద్ధి చేశారు. ముఖ్యంగా కొవిడ్ తర్వాత సఫారీ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. 2018-19 ప్రాంతంలో సుమారు రూ.1,500 - రూ.1,800 కోట్లుగా ఉన్న సఫారీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆయన వ్యూహాత్మక నాయకత్వంలో ప్రస్తుతం సుమారు రూ.12,000 కోట్లకు పైగా చేరుకుంది. ఈ వృద్ధి, ఆయన పూర్వ సంస్థ వీఐపీ కంటే మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం.

ఇదీ చదవండి: బీమా రంగానికి ఏఐ ధీమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement