
డబ్బు అప్పుగా తీసుకున్నప్పుడు అది తాత్కాలికంగా అప్పటి అవసరాలు తీరుస్తుంది. ఇది కొంచెం రిలీఫ్‌ను ఇస్తుంది. కానీ అప్పు అనేది ఫ్రీగా ఎవరూ ఇవ్వరు. అందుకు వడ్డీ చెల్లించాలి. అది క్రెడిట్ కార్డు అయితే సంవత్సరానికి 36 నుంచి 42%, పర్సనల్ లోన్ అయితే సంవత్సరానికి 15% దాకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వీటికి అదనంగా ఇంకొన్ని ఛార్జీలుంటాయి. అప్పు తీసుకున్న తర్వాతి క్షణం నుంచి వాటిని కట్టడానికి కష్టపడాల్సి ఉంటుంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తికి రూ.25,000 రూపాయల నెలవారీ జీతం. అతడు క్రెడిట్ కార్డు ఉపయోగించి రూ.50,000 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. తాత్కాలికంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత నెల నుంచి దానికి ఈఎంఐ కట్టలేక మళ్లీ నెల నెల కొంత అప్పు చేస్తున్నాడు. దానివల్ల అతడి క్రెడిట్ స్కోర్ కూడా తగ్గవచ్చు. భవిష్యత్తులో ఇంటి కోసం, పిల్లల చదువు కోసం లోన్ కావాలంటే రాకపోవచ్చు. అంటే డబ్బు అప్పుగా తీసుకున్న ప్రతిసారి రేపటి జీవితాన్ని కష్టంలో పెడుతున్నారు. అయితే ఆర్థికంగా ఎదిగేందుకు అప్పు చేస్తే తప్పులేదు. కానీ స్థోమత లేకపోయినా విలాసాలకు అప్పు చేస్తే ఇబ్బందులు తప్పవు.
తిరిగి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు..
ఓ స్నేహితుడు మిమ్మల్ని రూ.2000 అప్పు అడిగాడు. మీరు ఇచ్చారు అనుకోండి. ఆ తర్వాత అతడు మీకు స్పందించట్లేదు. ఆ సమయంలో మీరు కంగారు పడకుండా సంతోషపడండి. ఎందుకంటే అతడు మీ నమ్మకాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. అతడికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశమే లేదు. తిరిగి ఇవ్వకపోవడం తప్పు అనే గిల్టీ భావన కూడా లేదు. ఇలాంటి వారు ఎమోషనల్ కథలు చెప్తారు. మరి అలాంటివాడు చిన్న అమౌంట్‌తోనే పారిపోయాడు. అదే రూ.2000కు బదులు మిమ్మల్ని రూ.20,000 అడిగినా కూడా మీరు ఇచ్చి ఉండేవారు కదా. అంటే పెద్ద నష్టానికి ముందే మీకు అతడి గురించి తెలిసిపోయింది. మీరు ఎవరికైనా కొద్దిగా డబ్బు అప్పుగా ఇచ్చి తర్వాత వారిని మళ్లీ చూడకపోతే అది మంచిదే అనుకోవాలి. ఎందుకంటే వారి నిజ స్వభావం బయటపడింది. పెద్ద నష్టాల నుంచి మీరు తప్పించుకున్నారు.
మీ విలువ ఎంత?
మనలో కొంతమంది మాత్రమే ఆర్థికంగా విజయం సాధిస్తారు. కానీ మరికొందరు ఎంత కష్టపడినా సంపాదించలేరు. ఇద్దరికీ అవకాశాలు ఒకటే.. నాలెడ్జ్ ఒకటే మరి ఎక్కడ తేడా ఉందని ఆలోచించారా? ఈ సందర్భంలో సెల్ఫ్ వర్త్ అంటే స్వీయ విలువ మీకు మీరు ఎలా విలువ ఇచ్చుకుంటున్నారు అనేది కీలకంగా ఉంటుంది. మీ సెల్ఫ్ వర్త్ పెరిగితే మీ నెట్ వర్త్ కూడా పెరుగుతుంది. నెట్ వర్త్ అంటే మీ మొత్తం ఆస్తులు మైనస్ అప్పులు. సెల్ఫ్ వర్త్ అనేది మీ విలువ పెంచుకోవడం మాత్రమే కాదు మీపై మీకున్న నమ్మకం, ఎబిలిటీస్, తెలివి.. ఇవన్నీ వస్తాయి.
ఉదాహరణకు సుందర్ పిచాయ్ చిన్న ఇంట్లో పెరిగినా తనపై నమ్మకంతో అంటే సెల్ఫ్ వర్త్‌తో గొప్ప అవకాశం అందిపుచ్చుకొని గూగుల్‌కు సీఈఓ అయ్యారు. మొత్తానికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ స్వీయ విలువ అంటే సెల్ఫ్ వర్త్ పెరిగినప్పుడు మీ నికర విలువ అంటే నెట్‌వర్త్ కూడా దాంతో పాటే పెరుగుతుంది.
ఇదీ చదవండి: డబ్బులోని కష్టాన్ని గ్రహిస్తున్నారా?