
డబ్బు సంపాదించడానికి చాలామంది ఎంతో కష్టపడుతుంటారు. అయితే వారసత్వంగా తండ్రులు, తాతలు సంపాదించిన ఆస్తులున్నవారిలో కొందరు మాత్రమే దాని వెనుక ఉన్న కష్టాన్ని గ్రహిస్తారు. ఇంకొందరు తేరగా వచ్చిందని విలాసాలకు ఖర్చు చేస్తూ కొండంత డబ్బు కోటను కరిగిస్తుంటారు. వారసత్వంగా వచ్చిన డబ్బుపై చాలామందిలో భిన్నాభిప్రాయాలుంటాయి.
సొంత డబ్బు వర్సెస్ వారసత్వంగా వచ్చిన డబ్బు
మనందరికీ డబ్బు రెండు రకాలుగా వస్తుంది(Hard Earned Money vs Parents Money). ఒకటి మీరు సొంతంగా సంపాదించిన డబ్బు. రెండు.. మీ తాతలు, తండ్రుల దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన డబ్బు. సొంతంగా సంపాదించిన వ్యక్తి ఖర్చు చేసే ప్రతి రూపాయి వెనుక హార్డ్‌వర్క్, తాపత్రయం ఉంటుంది. ఖర్చు పెట్టడంలో ఉన్న పెయిన్ అర్థమవుతుంది. అందుకే ఈ కేటగిరీ వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కొందరిలో వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఎలాంటి తాపత్రయం ఉండదు.
పైరెండు అంశాలకు ఉదాహరణను చూద్దాం.. మైక్రోసాఫ్ట్(Microsoft) వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ సందర్భంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ధనవంతుడిగా ఉన్న ఆయన ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసి బిల్లు చెల్లించారు. కానీ వెయిటర్‌కు టిప్ ఇవ్వలేదు. అంతకుముందు ఆయన కూతురు కూడా అదే రెస్టారెంట్‌కు వచ్చి భోజనం చేసింది. ఆమె బిల్ కట్టి వెయిటర్‌కు భారీగా టిప్ ఇచ్చింది. ఆ వెయిటర్ ఇదే విషయాన్ని బిల్ గేట్స్‌ను అడిగాడు. ‘మీరు ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుల్లో ఒకరు. మీరు టిప్ ఇవ్వలేదు. కానీ మీ కూతురు మాత్రం పెద్ద మొత్తంలో టిప్ ఇచ్చింది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని అడిగాడు. అందుకు బిల్ గేట్స్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ‘అవును.. నేను ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా ఫాదర్ మిడిల్ క్లాస్ వ్యక్తి. కానీ నా కూతురు పరిస్థితి అలా కాదు తన ఫాదర్ రిచ్ కదా’ అని చెప్పుకొచ్చారు.
వారసత్వంగా సంపద చేకూరినా డబ్బు విలువ తెలుసుకొని మనుగడ సాగించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ డబ్బును ఎలా పొదుపు చేసి దాని విలువను పెంచాలనేదానిపై దృష్టి పెట్టాలంటున్నారు. అనవసరాలకు ఖర్చు చేస్తున్న డబ్బు పట్ల అప్పమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. డబ్బు ఖర్చు చేయడం కంటే సంపాదించడం చాలా కష్టమనే విషయాన్ని గుర్తించుకోవాలని చెబుతున్నారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!