
ఇల్లు నిర్మించడం అనేది ప్రతివ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆర్థిక, భావోద్వేగ పెట్టుబడుల్లో ఒకటి. కానీ, నిర్మాణ ఖర్చులు క్రమంగా పెరుగుతున్న కాలంలో మెటీరియల్ ధరలు, ద్రవ్యోల్బణం, కార్మిక కొరత సవాళ్లుగా మారుతున్నాయి. అయినప్పటికీ సొంతింటి నిర్మాణంలో నాణ్యత విషయంలో గృహ యజమానులు రాజీపడడం లేదు. అందుకోసం తెలివైన, మరింత సమర్థవంతమైన మార్గాల కోసం చూస్తున్నారు. అందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి మెటీరియల్ కొనుగోలు విషయంలో డబ్బులు మిగుల్చుకునే మార్గాలు ఏమిటో.. నిర్మాణదశలో కొత్త టెక్నాలజీలు ఏమున్నాయో తెలుసుకుందాం.
డబ్బు మిగిలే మార్గాలు..
బల్క్ ఆర్డర్లు
పెద్ద మొత్తంలో మెటీరియల్స్ కొనుగోలు చేయడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. సరఫరాదారులు తరచుగా సిమెంట్, స్టీల్, ఇటుకలు, టైల్స్ బల్క్ ఆర్డర్లపై రాయితీ ఇస్తారు. నిత్యం చిన్నమొత్తంలో కొనుగోలు చేయడం కంటే బల్క్‌గా కొంటే రిటైలర్‌తో బేరమాడి తక్కువ ధరకే పొందవచ్చు.
సీజనల్ కొనుగోలు
మెటీరియల్ ధరలు సీజన్‌ను అనుసరించి మారుతుంటాయి. మార్కెట్ డిమాండ్‌తో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించాలి. ఉదాహరణకు, వర్షాకాలంలో ఉక్కు, సిమెంట్ ధరలు చౌకగా ఉండే అవకాశం ఉంటుంది.
ప్రత్యామ్నాయ మెటీరియల్
ప్రత్యామ్నాయ నిర్మాణ సామగ్రిని ఎంచుకోవడంతో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫ్లై యాష్ ఇటుకలు, ఏఏసీ బ్లాక్స్ వంటివి తక్కువ ధరతో ఎక్కువ మన్నికనిస్తాయి. ఈ మెటీరియల్స్ నిర్మాణ, రవాణా ఖర్చులను కూడా తగ్గిస్తాయి.
పునర్వినియోగం
పాత భవనాలు లేదా కూల్చివేసిన సైట్ల నుంచి కిటికీలు, తలుపులు, శానిటరీవేర్ లేదా టైల్స్ వంటి సెకండ్ హ్యాండ్ మెటీరియల్స్‌ను తిరిగి వాడుకోవచ్చు. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా రీయూజబుల్ మెటీరియల్‌ను అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకొని అవసరమైతే కొనుగోలు చేసుకోవచ్చు.
ప్రభుత్వ పథకాలు
ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. భవనాలకు కావాల్సిన మెటీరియల్స్‌పై తగ్గించిన జీఎస్టీ రేట్లు, సరసమైన గృహాలకు సబ్సిడీలు (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వంటివి), పన్ను మినహాయింపులు ఇవన్నీ మొత్తం నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి దోహదం చేస్తాయి.
టెక్నాలజీలు
నిర్మాణంలో 3డీ ప్రింటింగ్
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 3డీ-ప్రింటెడ్ గృహాలు నిర్మాణం ఎక్కువైంది. టెక్నాలజీ ఆధారంతో ఎలాంటి డిజైనింగ్ ఇళ్లు కావాలనేదానిపై ముందుగానే అంచనాలు ఏర్పరుచుకొని ఖర్చు తగ్గించుకునేలా 3డీ ప్రింటెడ్ గృహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగంలో కొన్ని స్టార్టప్‌లు తక్కువ సమయంలోనే గృహాలను నిర్మిస్తున్నాయి. దీనివల్ల సమయం, కార్మిక ఖర్చులు రెండింటినీ మిగుల్చుకోవచ్చు.
ప్రీ-ఫ్యాబ్రికేటెడ్
ప్రీ-కాస్ట్ గోడలు(ముందుగానే కట్టిన గోడలు), ఫ్లోర్ ప్యానెల్స్, పైకప్పులు బయట ఫ్యాక్టరీల్లో తయారు చేస్తున్నారు. ఇంటి అవసరానికి తగినట్లుగా నిర్దిష్ట కొలతలతో అసెంబ్లింగ్ కోసం నిర్మాణ స్థలానికి రవాణా చేస్తున్నారు. ఇది ఆన్-సైట్ వ్యర్థాలను తగ్గిస్తుంది. నిర్మాణ సమయాన్ని 50% వరకు తగ్గించగలదు.
బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం)
బీఐఎం వాస్తుశిల్పులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు భాగస్వామ్య 3D మోడల్‌ను ఉపయోగించి వారికి సహకరిస్తుంది. ఇది కచ్చితమైన పదార్థ అంచనాను నిర్ధారిస్తుంది. డిజైనింగ్ అవరోధాలను నిరోధిస్తుంది. సరళంగా చెప్పాలంటే బీఐఎం అనేది కట్టే ఇంటికి నమూనాలాంటిది.
ఏఐ-ఆధారిత ఎస్టిమేటర్లు
కృత్రిమ మేధ సాధనాలు డిజైన్ బ్లూప్రింట్లను విశ్లేషించగలవు. కచ్చితమైన మెటీరియల్ అంచనాలను అందించగలవు. ఇది అధిక ఆర్డర్లు, తక్కువ వినియోగం లేదా చివరి నిమిషంలో మెటీరియల్ కోసం కంగారు పడడం వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ కాంక్రీట్
ఫ్లై యాష్, స్లాగ్ వంటి పారిశ్రామిక వ్యర్థ ఉత్పత్తుల నుంచి తయారైన జియోపాలిమర్ కాంక్రీట్ సాంప్రదాయ సిమెంట్‌కు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రత్యామ్నాయం అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ మెటీరియల్ మన్నికగా ఉంటూ పర్యావరణ కాలుష్యాన్ని కట్టడి చేయడంలో తోడ్పడుతుంది.
డ్రోన్ ఆధారిత సైట్ సర్వేలు
హై-రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లతో కూడిన డ్రోన్లు వివరణాత్మక టోపోగ్రాఫిక్ మ్యాప్‌లు అందిస్తాయి. భారీ నిర్మాణ సైట్‌ల్లో డెవలప్‌మెంట్‌ను ట్రాక్ చేసేందుకు ఇది ఎంతో తోడ్పడుతుంది.
ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’