పార్కుల ముసుగులో బాబు పందేరం..
ఏపీఐఐసీ నుంచి భూములు తీసుకోండి.. మీకు నచ్చినట్లు అమ్ముకోండి!
రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కారు మరో బంపర్ ఆఫర్
ఎంఎస్‌ఎంఈ పార్కులంటూ 22 చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు
ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐఐసీ
అందులో సింహభాగం భూములు దళితుల నుంచి ఏపీఐఐసీ ద్వారా సేకరించినవే
పారిశ్రామిక పార్కుల కోసం నమ్మి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులు
ఇప్పుడు ఏపీఐఐసీని పక్కనపెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు ధారాదత్తం
పార్కుల కోసమంటూ ఇప్పటికే రూ.8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్న ఏపీఐఐసీ.. వాటితో పనులు చేయిస్తూనే.. ప్రైవేట్ వ్యక్తులకు భూములు పందేరం
ప్రైవేట్ వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు
దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు ప్రభుత్వం
ఇప్పటికే ‘లిఫ్ట్’ పాలసీతో విశాఖలో అత్యంత విలువైన భూములు కారుచౌకగా ‘రియల్’ కంపెనీల పరం
సాక్షి, అమరావతి: అవన్నీ దాదాపుగా దళితుల భూములే..! పారిశ్రామిక అవసరాల కోసం సేకరిస్తున్నామనడంతో స్థానికంగా అందరికీ ఉపాధి లభిస్తుందనే నమ్మకంతో ఎంతో మంది రైతులు భూములిచ్చారు. ఇక ఎస్సీ ఎస్టీలైతే.. ఏపీఐఐసీ తీసుకునే దాంట్లో చట్ట ప్రకారం 22.5 శాతం భూమిని దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తమ దక్షత చాటుకునేందుకు ఇదో మంచి అవకాశమని భావించారు. నమ్మి అసైన్డ్ భూములను అప్పగించారు.
కానీ చంద్రబాబు సర్కారు ఏం చేస్తోంది..? విలువైన ఆ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది. దళిత యువ పారిశ్రామికవేత్తల ఆశలను నీరుగారుస్తోంది. పారిశ్రామిక పార్కుల ముసుగు తొడిగి.. దళితుల నుంచి తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెర తీసింది. చంద్రబాబు సర్కారు బరి తెగించి సాగిస్తున్న మరో భూదందా ఇదిగో ఇలా ఉంది...!

ఏపీఐఐసీ భూములు ప్రైవేట్‌కు ధారాదత్తం...
ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ పేరిట ఇప్పటికే విశాఖలో రూ.వేల కోట్ల విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ పార్కుల ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ పాలసీ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ఇండ్రస్టియల్ పార్క్స్ విత్ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2024–29 పాలసీ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ఏపీఐఐసీ బిడ్లను ఆహ్వానించింది.
పీపీపీ విధానంలో 22 ప్రైవేట్ పార్కుల కోసం అస్మదీయులకు ఈ భూములను అప్పగించనున్నారు. పారిశ్రామిక పార్కులకు సంబంధించి ఎటువంటి అనుభవం లేని వ్యక్తులను సైతం సొంతంగా బిడ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడంపై అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వ్యక్తులతో పాటు ప్రాపర్టీషి ప్ సంస్థలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థలు ఈ బిడ్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
‘రియల్’ లబ్ధి కోసమే..!
నివాస సముదాయాలు, రెసిడెన్షియల్ లే అవుట్లు, టౌన్‌షి ప్ లేఅవుట్‌లు వేసిన సంస్థలను కూడా ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు బిడ్‌లలో పాల్గొనేందుకు అనుమతించటాన్ని బట్టి ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడమే అసలు ఉద్దేశమని స్పష్టం చేస్తున్నారు.
పారిశ్రామిక పార్కుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సముదాయాలు, ఆస్పత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్ల నిర్మాణానికి అనుమతిస్తున్నారంటే దీని వెనుక ఉన్న ‘రియల్’ ఉద్దేశాలు అర్థం చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. బిడ్లు ఆహ్వానించడానికి 2026 జనవరి 19 చివరి తేదీగా నిర్ణయించారు.
తీరు మారిన ఏపీఐఐసీ
ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఎటువంటి కన్సల్టెన్సీల ప్రమేయం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు ఫార్మా, బయో టెక్నాలజీ పార్కులను ఈ సంస్థ నిర్మించింది. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ భూమి సేకరిస్తోందంటే.. తమ బిడ్డలతోపాటు ఇరుగు పొరుగు వారికి ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎంతో మంది రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు.
ఇక ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో అత్యధికం దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములే ఉన్నాయి. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తే వాటి ద్వారా తమకు ఉపాధి లభించడంతో పాటు చట్టప్రకారం 22.5% భూమిని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేటాయించాల్సి ఉన్నందున తాము కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చనే ఆశతో తమ భూములను అప్పగించారు. కానీ చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టాక ఏపీఐఐసీ తీరు పూర్తిగా మారిపోయింది.
547 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న ఆ సంస్థ.. ఇప్పుడు కొత్తగా పారిశ్రామిక పార్కులను నిరి్మంచలేమంటూ చేతులెత్తేసింది. పేదల నుంచి సేకరించిన రూ.వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు, రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి ఉత్సాహం చూపుతోంది. ఒకపక్క ఏపీఐఐసీ పారిశ్రామికపార్కుల పేరిట రూ.8,500 కోట్ల రుణాలను సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఆ డబ్బులను తీసుకోవడంతోపాటు.. పారిశ్రామిక పార్కుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూములు కట్టబెడుతుండటం పట్ల అధికార వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
పీపీపీ విధానంలో చేపట్టే ఈ పారిశ్రామికపార్కుల్లో రూల్ ఆఫ్ లా కింద ఎస్సీ ఎస్టీలకు 22.5% రిజర్వేషన్లు అమలు చేయరని, తద్వారా బడుగు వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల ఆశలను చంద్రబాబు సర్కారు తుంచేసిందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
టెండర్లు పిలిచిన ఎంఎస్‌ఎంఈ పార్కులు
ఆర్.కృష్ణపురం, ఆళ్లగడ్డ, నంద్యాల జిల్లా
గుండ్లమడుగు, వైఎస్సార్ కడప జిల్లా
టి.చౌడూరు, వైఎస్సార్ కడప జిల్లా
పల్లుగుర్రంపల్లి, వైఎస్సార్ కడప జిల్లా
చేదెళ్ల, పుంగనూరు, చిత్తూరు జిల్లా
చిన్నపండూరు, తిరుపతి జిల్లా
కుక్కరాజుపల్లె, అన్నమయ్య జిల్లా
నిజాంపట్నం, బాపట్ల జిల్లా
వై.కోట, అన్నమయ్య జిల్లా
మంగాడు, చిత్తూరు జిల్లా
అనంతపురం
గోవాడ, బాపట్ల జిల్లా
నాయునిపల్లి, బాపట్ల జిల్లా
గంగపాలెం, ప్రకాశం జిల్లా
ముత్యాలంపాడు, విజయవాడ
పరవాడ, అనకాపల్లి జిల్లా
నిడదవోలు, తూ.గో. జిల్లా
హంసవరం, కాకినాడ జిల్లా
చెరుకుమిల్లి, తూ.గోజిల్లా
గోపాలపట్నం, ముడసరలోవ విశాఖ జిల్లా
టెక్కలి, శ్రీకాకుళం జిల్లా


