హోండా ఎలివేట్‌ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

హోండా ఎలివేట్‌ వచ్చేసింది

Published Tue, Sep 5 2023 4:17 AM

Honda unveils Elevate SUV in Indian markets - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా భారత మార్కెట్లోకి మధ్యస్థాయి ఎస్‌యూవీ ఎలివేట్‌ ప్రవేశపెట్టింది. ఎలివేట్‌కు భారత్‌ తొలి మార్కెట్‌ కాగా, ఈ మోడల్‌ ద్వారా కంపెనీ మధ్యస్థాయి ఎస్‌యూవీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.10.99–15.99 లక్షలు ఉంది. 121 పీఎస్‌ పవర్, 145 ఎన్‌ఎం టార్క్‌తో 6–స్పీడ్‌ మాన్యువల్, 7–స్పీడ్‌ సీవీటీ ట్రిమ్స్‌లో 1.5 లీటర్‌ ఐ–వీటీఈసీ పెట్రోల్‌ ఇంజన్‌ పొందుపరిచారు.

లీటరుకు మైలేజీ మాన్యువల్‌ ట్రిమ్‌ 15.31, సీవీటీ 16.92 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టంతో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, లేన్‌ వాచ్‌ కెమెరా, ఎల్రక్టానిక్‌ స్టెబిలిటీ, ట్రాక్షన్‌ కంట్రోల్‌తో వెహికిల్‌ స్టెబిలిటీ అసిస్ట్, హిల్‌ స్టార్ట్‌ అసిస్ట్, మల్టీ యాంగిల్‌ రేర్‌ వ్యూ కెమెరా, 458 లీటర్ల కార్గో స్పేస్, 7 అంగుళాల హెచ్‌డీ ఫుల్‌ కలర్‌ టీఎఫ్‌టీ మీటర్‌ క్లస్టర్, 10.25 అంగుళాల ఐపీఎస్‌ హెచ్‌డీ ఎల్సీడీ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లే ఆడియో, డ్రైవ్‌ వ్యూ రికార్డింగ్‌ వంటి హంగులు ఉన్నాయి. హ్యుందాయ్‌ క్రెటా, మారుతీ సుజుకీ గ్రాండ్‌ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్‌ క్రూజర్‌ హైరైడర్‌కు పోటీనిస్తుంది.  

అయిదు ఎస్‌యూవీలు: భారత్‌లో 2030 నాటికి అయిదు ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్టు హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకూయా సుముర తెలిపారు. ‘భారత ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమలో ఎస్‌యూవీల వాటా ఏడాదిలో 43 నుంచి 48 శాతానికి చేరింది. ఈ విభాగం కంపెనీకి చాలా కీలకం కానుంది. ఎలివేట్‌ చేరికతో కంపెనీకి కొత్త కస్టమర్లు తోడు కానున్నారు. ఎస్‌యూవీ విభాగంలో లేకపోవడంతో చాలా కోల్పోయాం. అందుకే ఎలివేట్‌ను పరిచయం చేయడం గొప్పగా భావిస్తున్నాం’ అని వివరించారు. రాజస్తాన్‌లోని ప్లాంటు సామర్థ్యాన్ని పెంచామని, ప్రస్తుతం రోజుకు 660 యూనిట్లు ఉత్పత్తి చేయగలమని చెప్పారు. జూలై నుంచి ఎలివేట్‌ బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి.

Advertisement
 
Advertisement