మళ్లీ 50 శాతం మార్కెట్ వాటా కోసం మారుతీ వ్యూహం
టోక్యో: దేశీయంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో మళ్లీ 50 శాతం మార్కెట్ వాటాను దక్కించుకోవడంపై ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో ఎనిమిది ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. దీంతో మొత్తం మోడల్స్ శ్రేణి 28కి చేరుతుంది. జపాన్ మొబిలిటీ షోను సందర్శిస్తున్న భారతీయ విలేఖరులకు సుజుకీ మోటర్ కార్పొరేషన్ రిప్రజెంటేటివ్ డైరెక్టర్ తొషిహిరో సుజుకీ ఈ విషయాలు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో మారుతీ సుజుకీ మార్కెట్ వాటా సుమారు 39 శాతంగా నమోదైంది. దీన్ని 50 శాతానికి పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, ఎగుమతుల్లో అగ్రస్థానం దక్కించుకునే లక్ష్యాలకు కంపెనీ కట్టుబడి ఉన్నట్లు సుజుకీ వివరించారు. ఇందుకోసం వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకుంటున్నట్లు చెప్పారు. 2030–31 నాటికి రూ. 70,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను ఇప్పటికే ప్రకటించినట్లు చెప్పారు.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీ సహా అన్ని రకాల కార్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. బయోగ్యాస్ ఆధారిత వాహనాలను కూడా ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నామని, గుజరాత్‌లో తొమ్మిది బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయని సుజుకీ చెప్పారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దన్నుతో యూరోపియన్ దేశాలకి ఎగుమతులకు భారత్ హబ్‌గా మారగలదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తమ కార్ల ఎగుమతులు 4 లక్షల యూనిట్లకు చేరగలవని సుజుకీ తెలిపారు. ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో ఇప్పటికే రెండు లక్షల యూనిట్లను కంపెనీ ఎగుమతి చేసింది. 2024లో కంపెనీ రికార్డు స్థాయిలో 3.3 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది.


