'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు | Hiring to Slow Down in The Second Half Teamlease Data | Sakshi
Sakshi News home page

'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు

Jun 1 2025 8:47 AM | Updated on Jun 1 2025 9:44 AM

Hiring to Slow Down in The Second Half Teamlease Data

వృద్ధి 2.8 శాతానికి పరిమితం

టీమ్‌లీజ్‌ సర్వీసెస్ నివేదిక

న్యూఢిల్లీ: ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొని, ఖర్చులు విషయంలో కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు నెమ్మదించనున్నాయి. రిక్రూట్‌మెంట్‌ కార్యకలాపాల వృద్ధి (ఎన్‌ఈసీ) 2.8 శాతానికి పరిమితం కానుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌-మార్చి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. నియామకాల తీరుతెన్నులపై టీమ్‌లీజ్‌ సర్వీసెస్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

నివేదిక ప్రకారం 47 శాతం సంస్థలు సిబ్బందిని పెంచుకుంటామని, 28 శాతం సంస్థలు స్థిరంగా కొనసాగిస్తామని, 25 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల నుంచి 23 పరిశ్రమలకు చెందిన 1,263 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.

నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు
➤డిమాండ్‌ను బట్టి ఉద్యోగులను తీసుకునే ఫ్లెక్సి స్టాఫింగ్‌ విధానానికి 69 శాతం సంస్థలు మొగ్గు చూపాయి. దీర్ఘకాలిక వ్యయాల భారం లేకుండా, సత్వరం కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ విధానంలో వీలుంటోంది.

➤హైరింగ్‌ వ్యూహాల్లో గిగ్‌ ఎకానమీకి (స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్స్‌ వర్కింగ్‌) ప్రాధాన్యం లభిస్తోంది. 64 శాతం కంపెనీలు గిగ్‌ విధానాల ద్వారా సేల్స్, కస్టమర్‌ సరీ్వస్‌ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.

➤ద్రవ్యోల్బణం, ఎగుమతులు మందగించడం, జీడీపీ నెమ్మదించడం తదితర అంశాల కారణంగా వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు 58 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను ఏదో పేరుకి మాత్రమే పెంచుకోవడం కాకుండా, నిర్దిష్ట నైపుణ్యాలున్న వారినే తీసుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.

ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

➤76 శాతం కంపెనీలు డిజిటల్‌ లిటరసీకి, 68 శాతం కస్టమర్‌  ఎక్స్‌పీరియన్స్‌ మేనేజ్‌మెంట్‌కి, 63 శాతం సంస్థలు కమ్యూనికేషన్‌లాంటి కీలక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపాయి.

➤ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్‌కి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆటోమోటివ్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల రంగాలు, ఈ–కామర్స్, టెక్‌ స్టార్టప్‌లు వృద్ధి చెందనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement