
ఎంట్రీ లెవల్ ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ మందగించడంతో వాహన తయారీదారులు, డీలర్లు ఈ పండుగ సీజన్‌లో ఆఫర్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూ.10 లక్షలలోపు బడ్జెట్ కార్లపై డిస్కౌంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్వెంటరీ పేరుకుపోతుండడంతో అమ్మకాలను గాడిన పెట్టేందుకు బడ్జెట్ కార్లపై రూ.20,000 నుంచి రూ.80,000 వరకు డిస్కౌంట్లను అందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
భారతీయ ఆటో పరిశ్రమకు ఒకప్పుడు అమ్మకాల్లో భారీగా వాల్యూమ్ జనరేట్ చేసిన ఈ విభాగం ఈ మధ్య కాలంలో నిరంతరం మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అయినప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్‌యూవీలకు డిమాండ్ బలంగా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న డీప్ డిస్కౌంట్ల వల్ల తక్కువ మార్జిన్లతో సంస్థలు నెట్టుకొస్తున్నాయనే వాదనలున్నాయి. ‘భారీ డిస్కౌంట్లు డీలర్లకు నష్టం కలిగిస్తాయి. ఎంట్రీ లెవల్ కార్లలో డిమాండ్ తగ్గుముఖం పట్టింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య మునుపటి స్థాయికి రాలేదు’ అని ఓ ఆటోమొబైల్ డీలర్ తెలిపారు.
ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండ
రూ.10 లక్షల లోపు కేటగిరీలోని బడ్జెట్ సెగ్మెంట్ వాహనాల అమ్మకాలపై ఒత్తిడి ఉన్నట్లు అగ్రగామి సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్ అంగీకరించింది. ‘రూ.10 లక్షలలోపు కార్ల అమ్మకాల్లో ఒత్తిడి ఉంది. డిమాండ్ కూడా తగ్గింది. ఈ విభాగంలో సంవత్సరం ప్రాతిపదికన దాదాపు 15% క్షీణత నమోదైంది’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర చెప్పారు.