
భారత బ్యాంకింగ్ రంగం అధిక మొత్తంలో ఖాతాదారుల ఫిర్యాదులతో సతమతమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో అత్యధికంగా ఖాతాదారుల ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ ముందుస్థానంలో ఉంది. సర్వీస్ డెలివరీ, డిజిటల్ ఇంటర్‌ఫేస్‌లను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ‘ఇతర’ కేటగిరీల కింద సమస్యలు పెరిగాయి. ఇందులో సైబర్ సెక్యూరిటీ, అత్యవసర సర్వీసులు అందించడంలో ఆలస్యం జరగడం వంటివి ఉన్నాయి.
టాప్‌లో ఎస్‌బీఐ
2025 బీఆర్ఎస్ఆర్ ప్రకారం ఎస్‌బీఐ అనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి 6.87 లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా రుణ మంజూరుతో సహా అత్యవసర సేవలను ఆలస్యంగా అందించినందుకు 12,502 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరం కంటే 7,223 పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 24.02 లక్షల ఫిర్యాదులతో పోలిస్తే ఎస్‌బీఐ ‘ఇతర’ కేటగిరీ కింద 21.50 లక్షల ఫిర్యాదులను నివేదించింది. ఈ కేటగిరీలో సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ ఆలస్యం.. వంటివాటి పరిధిలోకి రాని ఇతర ఫిర్యాదులు ఉంటాయి. అయితే, పారదర్శకత, ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన బహుళ ఫిర్యాదుల పరిష్కార మార్గాలను బ్యాంక్ హైలైట్ చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 11.30 లక్షల ఫిర్యాదు సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి 11.39 లక్షలకు చేరింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)కి 5.34 లక్షల ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువ భాగం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ సేవలు, ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకులు ఇలా..
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్‌లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. నిత్యావసర సేవల్లో జాప్యానికి సంబంధించి 4.97 లక్షల ఫిర్యాదులు రాగా, మార్చి నెలాఖరు నాటికి 8,782 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘ఇతర’ కేటగిరీ కింద 76,111 ఫిర్యాదులు రాగా, ప్రకటనలకు సంబంధించి 12,744, వాణిజ్య పద్ధతులకు సంబంధించి 4,438 ఫిర్యాదులు వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో సర్వీసుల ఆలస్యం ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 5.34 లక్షల ఫిర్యాదులను నివేదించింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 45,151 కేసులు పరిష్కారం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
హెచ్‌డీఎప్‌సీ బ్యాంక్‌లో ‘ఇతర’ కేటగిరీ కింద 4.42 లక్షల ఫిర్యాదులు అందాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల నుంచి ఇది తగ్గింది. 16,133 ఫిర్యాదులు ఇప్పటికీ పరిష్కరించలేదు.
ఇదీ చదవండి: స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?
ప్రధాన రుణదాతల్లో కస్టమర్ ఫిర్యాదులు స్థిరంగా పెరుగుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను స్వీకరించడం, సర్వీస్ డెలివరీ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల్లో అంతరాలను ఇది సూచిస్తుంది. బ్యాంకులు వాటి సర్వీసులు, సామర్థ్యాలను విస్తరించినప్పటికీ, అపరిష్కృత సమస్యలు, ముఖ్యంగా అత్యవసర సేవలను పరిష్కరించాల్సిన కార్యాచరణను హైలైట్ చేస్తుంది.