
హైదరాబాద్: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ ది హార్ట్‌ఫోర్డ్ తాజాగా హైదరాబాద్‌లో తమ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అధునాతన వర్క్‌స్టేషన్లు, శిక్షణా సదుపాయాలు మొదలైన ప్రత్యేకతలతో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్, కృత్రిమ మేథ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు.
సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ పేరొందిన నేపథ్యంలో నగరాన్ని ఎంచుకున్నట్లు చీఫ్ డేటా, ఏఐ, ఆపరేషన్స్ ఆఫీసర్ జెఫ్ హాకిన్స్ తెలిపారు. దాదాపు 200 ఏళ్ల పైగా చరిత్ర గల ది హార్ట్‌ఫోర్డ్‌కి ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్, షికాగో తదితర ప్రాంతాల్లో టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి.